ఎస్సి, ఎస్టీ లకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు వ్యతిరేకించడం రాజ్యాంగ ప్రాధమిక హక్కును హరించడమే!

షేర్ చెయ్యండి
 
ప్రమోషన్లలో రిజర్వేషన్లు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పవర్ కార్పొరేషన్ లో షెడ్యూలు కులాలు మరియు తెగలకు చెందిన ఉద్యోగుల ప్రమోషన్ల లో ప్రాతినిధ్యాన్ని యం. నాగరాజు (2006) కేసులో వున్నా షరుతలను అమలు చెయ్యకుండా కల్పించినందుకు ఆ ప్రమోషన్లు నిలిపివేస్తూ ఏప్రియల్ 2011 లో సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం ద్వారా 117వ సారి రాజ్యాంగాన్ని సవరించాల్సిన పరిస్థితి వచ్చింది. 1950 జనవరి 26 రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండి 2011 ఏప్రియల్ వరకు బ్రాహ్మణీయ శక్తులు ఎస్సి, ఎస్టీ ఓబిసి ల ప్ర్రతినిధ్యాన్ని , అభివృద్ధిని వివిధ రూపాలలో నిత్యం అడ్డుకుంటున్నాయి. బాబాసాహెబ్ డా అంబేడ్కర్ 1918 లో సౌత్ బరో కమిటీ ముందుగానీ, 1924 లో ముద్దేమెన్ కమిటీ ముందుగానీ , 1928లో లార్డ్ సైమన్ కి ఇచ్చిన మెమొరాండంలో గాని, 1932 లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో, అన్నింటా షెడ్యూల్ కులాలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో ప్రాతినిధ్యం కావాలని కోరారు. సమర్ధవంతమైన ప్రభుత్వం కంటే ప్రజలందరి ప్రాతినిధ్యం గల ప్రభుత్వమే మంచిదని బాబాసాహెబ్ భావించేరు. ప్రాతినిధ్యం అంటే స్వాభిమానం, ప్రాతినిధ్యాన్ని ప్రాధమిక హక్కుగా బాబాసాహెబ్ డా అంబేడ్కర్ ధృడంగా విశ్వసించారు. అలాంటి ప్రాతినిధ్యాన్ని తాము పనిచేసే ప్రభుత్వ రంగ సంస్థల్లో అన్ని స్థాయిలలో ఉండాలని కోరుకోవడం ఎస్సి, ఎస్టీ ఉద్యోగుల ప్రాధమిక హక్కు.  అలాంటి హక్కును హరించడమంటే రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయడమే. ఈ ఎస్సి , ఎస్టీ ప్రయోజనాలు కాపాడటానికి బహుశా ఈ రాజ్యాంగ సవరణ ఆఖరిదైతే కాదు. అందుకే నిరంతర పోరాటానికి మానసికంగా సిద్దంకావాలి. 
 
పెరియార్ – మొదటి రాజ్యాంగ సవరణ :
 
ఎస్సి, ఎస్టీ, ఓబిసి లకు విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించడం, తద్వారా వారి సామజిక ఆర్ధిక సాధికారతకు తోడ్పడటం రాజ్యాంగ ప్రవేశికను మరియు ఆదేశిక సూత్రాలను నిజవర్తనం చెయ్యడంలో భాగం, అలా వీరి రిజర్వేషన్లు అమలు చేయడానికి మొదటి రాజ్యాంగ సవరణ చెయ్యాల్సి వచ్చింది. 1929 డిసెంబర్ 27 న పెరియార్ కృషితో కమ్యూనల్ జిఓ వచ్చింది. దీని ప్రకారం అన్నికులాలకు వారి జనాభా ప్రాతిపదికన విద్యా, ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం కల్పించడం జరిగింది. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత కమ్యూనల్ జిఓ రాజ్యాంగ విరుద్దమని వెనకబడిన కులాలకు రిజర్వేషన్లు వర్తింపజేయడం సమానత్వానికి వ్యతిరేకమని అప్పటి ప్రధాని నెహ్రు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు శాస్వితంగా దూరం చెయ్యాలని ప్రయత్నించింది. 1950, ఆగస్టు 4 న పెరియార్ ఇచ్చిన పిలుపుకు తమిళనాడు లో వెనుకబడిన తరగతుల ప్రజలు పెద్దఎత్తున ఉద్యమించారు. ఆ ఉద్యమ ఫలితంగా ఆర్టికల్ 15(4) ను చేర్చడం ద్వారా సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతుల అభివృద్ధికి ఆర్టికల్ 15(1) మరియు 29(2) అడ్డుకాదని స్పష్టంగా సవరణ చెయ్యడం జరిగింది. ఈ విధంగా గణతంత్ర దేశంగా ఏర్పడిన 8 నెలల్లోనే మొదటి రాజ్యాంగ సవరణ చెయ్యాల్సి వచ్చింది. బాబాసాహెబ్ డా అంబేడ్కర్ రాజ్యాంగ సభలో ఉపన్యసిస్తూ ఆర్టికల్ 16(4) లక్ష్యం “వెనుకబడిన తరగతులు ప్రభుత్వ కార్యనిర్వహణ మరియు అధికారంలో వారివాటా వారు పొందటమే” అన్నారు   
 
న్యాయవ్యవస్థ – రిజర్వేషన్లు :
 
ముక్యంగా రిజర్వేషన్ల విషయంలో రాజ్యాంగ సవరణలు చేయటానికి కోర్టులు కారణమవుతున్నాయి. కోర్టులు ఉద్దేశ్యపూర్వకంగా రాజ్యాంగానికి వక్ర భాష్యం చెప్పడం, అనుమానాలు రేకెత్తించే విధంగా తీర్పులివ్వడం జరుగుతుంది. ఈ తీర్పులు ద్వారా సమాజంలో మూలానివాసీ బహుజన సమాజం మీద ప్రతినిథ్య విధానం ( రిజర్వేషన్లు ) మీద అనేక అపోహలు కలుగజేస్తున్నాయి. రిజర్వేషన్లు సమానత్వానికి వెతిరేకమని (1951 చెంపక దొరై కేసు ) రిజర్వేషన్లు పొందేవారు ప్రతిభావంతులు కారని, తక్కువ ప్రతిభ కలవారని రిజర్వేషన్లు ద్వారా అవకాశాలు కల్పించాలని (ఇంద్ర సహానీ కేసు ), రిజర్వేషన్లు 50 శాతం మించరాదని, ఉన్నత విద్య, సూపర్ స్పెషాలిటీ స్ లో రిజర్వేషన్లు వర్తింప చేయరాదని(ప్రీతి శ్రీవాస్తవ కేసు ), రిజర్వేషన్లు 10 సంవత్సరాలే రాజ్యాంగంలో ఉందని, రిజర్వేషన్లు రాజకీయ ఒత్తిళ్ల మేరకే వర్తింప జేస్తున్నారని, వాటికి రాజ్యాంగబద్దత లేదనీ, అనేక విధాలుగా అత్యున్నత న్యాయస్థానాలు సాదా సీదా భాషల్లో తీర్పులిస్తున్నాయి. రిజర్వేషన్లు వెనక ఉన్న రాజ్యాంగ స్ఫూర్తిని గమనించకుండా రాజ్యాంగంలో లేని “ప్రతిభ” అనే పదజాలంను అతి తరచుగా ఉపయోగిస్తున్నాయి.
 
న్యాయ వ్యవస్థ అనేది రాజ్యాంగం సృష్టించిన ఒక అంగం లేదా వ్యవస్థ. ఆ వ్యవస్థ రాజ్యాంగానికి జవాబుదారీగా ఉండాలి కానీ అదొక అగ్రహారంగా తయారై ఎస్సి, ఎస్టీ , ఓబిసి లకు న్యాయం చెయ్యకుండా వీరి ప్రగతికి నిర్ధకమైన తీర్పులను మాత్రమే ఇస్తుంది. అందుకే బాబాసాహెబ్ డా అంబేడ్కర్ “జడ్జి అవినీతిపరుడైతే ఒక వ్యక్తి నష్టపోతాడు, అదే ఒక జడ్జి పక్షపాతియైతే సమాజం మొత్తం నష్టపోతుంది” అంటాడు 
 
షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలు వేల సంవత్సరాల నుండి అవమాణీయంగా చూడబడ్డారు. బాబాసాహెబ్ డా అంబేడ్కర్ వీరి కోసం పోరాడి, హక్కులు సాధించి రాజ్యాంగమనే చట్రంలో భద్రపరిచారు. వీరి జనాభా కు తగినంత సరియైన ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. అంటే దేశవ్యాప్తంగా షెడ్యూలు కులాల, తెగల నిష్పత్తి ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాతినిధ్యం కల్పించాలి. వీటిని రాజ్యాంగంలో 15(4) మరియు 16(4) రూపంలో పొందుపరిచారు. ఆర్టికల్ 15(1), 15(4) 16 (1), 16(4) మరియు 16(4A )ని ఆర్టికల్ 335 తో చుస్తే ఆ ఆర్టికల్స్ అన్నీ షెడ్యూలు కులాల , తెగల మరియు వెనకబడిన తరగతులకు ప్రాధమిక హక్కులు, షెడ్యూల్డ్ కులాల, తెగల మరియు వెనకబడిన తరగతులకు సామాజిక, ఆర్ధిక మరియు విద్య ప్రయోజనాలను ప్రత్యేక శ్రద్ధ తో  ప్రోత్సాహించాలని ఆర్టికల్ 46 నిర్ధేశించింది. వీరికి సామజిక, ఆర్ధిక, మరియు విద్యా రంగాలలో జరుగుచున్న అన్యాయాన్ని ఆసనాతలను తొలగించవల్సిన ప్రాధమిక బాధ్యత ప్రభుత్వం మీద ఉందని ఆర్టికల్ 38 నిర్దేశిస్తుంది. 
 
ఈ ఎస్సి, ఎస్టీ ఓ బి సి ప్రజలకు ఇన్ని హక్కులు ప్రమోషన్లలో రిజర్వేషన్లు) రాజ్యాంగంలో ప్రతిష్టించినా వాటిని కోర్టులో సవాలు చేయటం రాజ్యాంగం (1950) అమలులోకి వచ్చినప్పటి నుండి జరుగుతుంది. ఈ విధంగా కోర్టులో సవాలు చేయడం , కోర్టులు తీర్పులివ్వడం బాబాసాహెబ్ డా అంబేడ్కర్ ని , అయిన బావాజాల్ని, ఉద్యమాన్ని హత్యచేయడమే. 
 
బాబాసాహెబ్ డా అంబేడ్కర్ ఈ బ్రాహ్మణీయ సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని భావించారు. కానీ బ్రాహ్మణీయ శక్తులు న్యాయవ్యవస్థ బుజాలమీద కూర్చొని మనువాదాన్ని పునః ప్రతిష్టించే విధంగా తీర్పులిస్తూ ఎస్సి, ఎస్టీ , ఓబిసి లను నూన్యతాభావంలోకి నెట్టి వేస్తున్నాయి. 
 

ప్రమోషన్లలో రిజర్వేషన్లు – ఎస్సి / ఎస్టీ ఉద్యోగులు నిర్వర్తించవలసిన బాధ్యత: 

 
“Nobody can dare to raise an eyebrow towards a society, which has thirty lawyers, twenty engineers and ten doctors”
           – Babasaheb Dr B R Ambedkar 
 
అంటే మేధోపరంగా అభివృద్ధి చెందిన సమాజం వైపు కన్నెత్తి చూడటానికి ఎవ్వరూ ధైర్యం చెయ్యరని బాబాసాహెబ్ ఉద్దేశ్యం. ప్రాతినిధ్యం ద్వారా హక్కుగా ఉద్యోగాలు సంపాదించిన ఎస్సి / ఎస్టీ ఉద్యోగులు తాము అనుభవిస్తున్న హక్కులను (ప్రమోషన్లలో రిజర్వేషన్లు) కాపాడుకోవాలనే కనీస బాధ్యత లేకుండా ఉండటం వలన ఈరోజు ప్రమోషన్లలో ప్రాతినిధ్యం అనే హక్కును కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఈ సంక్లిష్టమైన భారతీయ సమాజంలో బాబాసాహెబ్ ఇచ్చిన హక్కులను రక్షించుకోవాలంటే మన సమాజానికి కావాల్సిన మేధస్సును సంపాదించుకోవాలి. ఈ మేధస్సుని సంపాదించుకోకుండా భౌతిక అవసరాల కోసం పరిగెట్టడం, తను మూలలను మర్చిపోవడం బాబాసాహెబ్ ఉద్యమాన్ని మోసగించడమే. హక్కులను కాపాడుకోవాలంటే , రిప్రజెంటేషన్ ని హక్కుగా నిలుపుకోవాలంటే ఈ ఉద్యోగస్తులు ప్రెజర్ గ్రూప్ గా తయారవ్వాలి. బాబాసాహెబ్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడమంటే రాజ్యాంగాన్ని సరైన విధంగా అమలుపరచడమే. 
 
    సామజిక పరివర్తన కేంద్రం వారి సౌజన్యంతో
 
Note: ఈ ఆర్టికల్ 5 జూన్ 2018 కి ముందు ప్రింట్ చేయబడింది. సుప్రీంకోర్టు జూన్ 5 న ఇచ్చిన తీర్పులో ఎస్సి, ఎస్టీల కు ప్రమోషన్ల లో రిజర్వేషన్లు రాజ్యాంగ చట్టాలు అనుసరించి ఇవ్వాలని తీర్పు వెల్లడించింది. 
(Visited 84 times, 1 visits today)
Also read  ఆదివాసీ యువకుడు మధుది ఆకలి హత్య!

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!