కుల ప్రయోజనాలకే తెలుగు మీడియా!

షేర్ చెయ్యండి
గత పదిహేను రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనిక పై జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అగ్రకుల మేధావి వర్గం మనల్ని ఎంత పిచ్చ సన్నాసుల కింద లెక్కేసుకుంటుందో మీకు అర్థం కావడం లేదా! ఆంధ్రప్రదేశ్ లోని అగ్రకుల ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా “ప్రత్యేక హోదా”  అనే అంశాన్ని పట్టుకుని మనల్ని రాబోయే ఎలక్షన్ల కోసం ఎంత నీట్ గా ప్రిపేర్ చేస్తున్నారో మీకు అర్థం కావడం లేదా ? వారి పత్రికలలోనూ , టి.వి. ల లోనూ ఏం రుబ్బుడు రుబ్బుతున్నార!
 
80% పైగా జనాభా ఉన్న బహుజన వర్గాల ప్రజల్లో ఉన్న అమాయకత్వాన్ని ఎంత నీట్ గా తమ తమ కుల రాజకీయపార్టీలకు అనుకూలంగా మార్చడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయో గమనిస్తున్నారా! 
 
ఉదాహరణకు  ఈనాడు పత్రికను తీసుకోండి . ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా బాట పట్టిందో ఆ మరుసటి రోజే తన పత్రికలో ” హోదాగ్రహం ” అని ఒక్కో అక్షరాన్ని పిడికెడు సైజులో బ్యానర్ ఐటమ్ గా పెట్టి ప్రత్యేక హోదా కోసం ఆ రోజు నుండే రాష్ట్రం అట్టుడుకుతున్నట్టు , దేశ రాజధాని ఢిల్లీ కి ముచ్చమటలు పట్టిస్తున్నట్టు వార్తలు వండి వడ్డించారు .
 
ఆ పత్రిక మనుగడే బహుజన మేధావులు , సామాన్య ప్రజలు చదివితేనే ఈ స్థాయిలో ఉందనే విషయాన్ని మరచి నిస్సిగ్గుగా , నిర్లజ్జగా వార్తలు వండడం మొదలు పెట్టింది . ఈ రాష్ట్రంలో కాని దేశ వ్యాప్తంగా వారి పాఠకులలో కొన్ని లక్షలమంది ఉపాధ్యాయ , ఉద్యోగ , డిగ్రీ , పి.జీ. లు చదువుకున్న మేధావి వర్గం ఉందన్న కనీస పరిజ్జానం లేకుండా ఒక్క రాత్రిలోనే ఒక పార్టీకి ఫేవరబుల్ గా ఈ విధమైన వార్తలు వండడం మొదలు పెడితే ఈ బహుజన మేధావి వర్గం ఏమనుకుంటుందొ అన్న కనీస స్పృహ లేకుండా వార్తలు వండి వడ్డించడం ఆరంబించింది .
 
వారి దృష్టి లో ఈ బహుజన మేధావి వర్గాన్ని ఎంత తెలివితక్కువ  కింద లెక్కాసారం వేసుకుందో ఊహించండి. అంటే ఆ పత్రిక తన అనుకూల రాజకీయ పార్టీకి ప్రయోజనాలు సిద్దించాలనుకుంటే   ప్రత్యేక హోదా అంశాన్ని పైకి లేపుతుంది . లేదంటే  ఆ అంశాన్ని ప్రాధాన్యత లేని అంశంగా పరిగణించి  మరుగునపరుస్తుంది .మరి ఇదే పత్రికకు గతంలో కొంతమంది మేధావి వర్గం కాని , ప్రత్యేక హోదా సాధన సమితి సభ్యులు కాని , కొన్ని రాజకీయ పార్టీలు కాని చేస్తున్న   అందోళనలను ఇదే పత్రిక పిడికెడు సైజు అక్షరాలతో బ్యానర్ ఐటమ్ గా ప్రజల ముందుకు ఎందుకు తీసుకురాలేదు ?
 
ఆలోచించండి మేధావి బహుజనులారా ! ఇక రేపో ఎల్లుండి నుండి మెయిన్ పేపర్ లో కొన్ని  పేజీలు  జిల్లాల సెంటర్ స్ప్రెడ్ పేజీలూ ఇదే అంశాలు వండి వార్చడానికి వినియోగిస్తుంది చూడండి . మీరు గతం లోకి వెడితే తమ అనుకూల , తమ  కులానికి చెందిన పార్టీని అధికారంలోకి తేవడానికి  ఇదే పత్రిక ఎక్కడో నెల్లూరు జిల్లాలో ఒక చిన్న ఊరు “దూబగుంట” లో జరిగిన సారా వ్యతిరేఖ ఉద్యమాన్ని తన పేపర్ నిండా ప్రత్యేక కథనాలతో నింపి , ఆనాటి ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఏహ్య భావాన్ని నింపి ఆనాటి  ప్రభుత్వం దిగిపోవడానికి తన వంతు శాయశక్తులా ప్రయత్నించి అందులో సఫలీకృతం చెంది మధ్యపాన నిషేధం ప్రధాన ఎజెండా గా ప్రచారం చేసిన తమ కులానికి చెందిన పార్టీని అధికారంలో కూర్చోబెట్టింది. తీరా ఆ పార్టీ అధికారంలోకి వచ్చి తమ హామిని కొన్ని నెలలు నెరవేర్చాక ఇదే పత్రిక మధ్యపాన నిషేధం అమలు ఆచరణ సాధ్యం కాదని మళ్లీ ప్రజల్లో ఒక విధమైన ఆలోచనలు రేకెత్తే విధంగా కథనాలు వడ్డించి క్రమంగా మధ్యపాన నిషధం ఒక నిరర్థక ప్రయోగం  అని ప్రజల మూడ్ మారే విధంగా వార్తలు వండి వడ్డించి అదే ప్రజలు నిషేధం ఎత్తివేయడమే బెటర్ అనే స్థాయికి ప్రజల్ని తీసుకొచ్చాక ఆనాటి ప్రభుత్వం నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేసి మధ్యం ద్వారా బ్రహ్మాండమైన ఆర్థిక ప్రయోజనాల్ని పొందడంలో తన వంతు సహకారం ఇతోధికంగా అందించింది. అంటే ఇక్కడ ఈ పత్రికకు కోట్లమంది ప్రజల ఆశలు , ఆకాంక్షల కన్నా తన కులం లోని వ్యక్తులు , వారి పార్టీ ప్రయోజనాలే పరమావధి .
 
ఈ ఒక్క పత్రికే కాదు  ఆంధ్రప్రదేశ్ లోని అగ్రకులాల చేతిలో నడిచే అన్ని మీడియా సంస్థలూ ఇదే బాపతే .ఎవరో ఒకరిద్దరు ఈ విషయంలో కొంత నిజాయితీగా ఉన్నా మెజారిటీ మీడియా సంస్థల ప్రధాన అజెండా తమ కులం యొక్క పార్టీని అధికారంలో కూర్చోబెట్టడమే . ఇక్కడ అత్యంత హాస్యాస్పదమైన అంశం ఏంటంటే ఈ మీడియా సంస్థలు వండి వడ్డించే పంచభక్షపరమాణ్ణ , మసాలా వార్తల్ని బాగా ఆకలింపు చేసుకుని కనీస యుక్తాయుక్త విచక్షణ లేకుండా వారి హితోపదేశాల్ని  ఢూఢూ బసవణ్ణ ల్లాగా ఫాలో అయ్యే పిచ్చ సన్నాసులం ఎవరయ్యా అంటే అది బహుజనులే!
 
గత డబ్బై సంవత్సరాలుగా 80 % పైగా జనాభా ఉన్న బహుజనుల్ని కేవలం 10% లోపే జనాభా ఉన్న రెండు అగ్రకులాలు ( ఈ రెండు కులాల్లో కూడా ఒక్కో కులం జనాభా5 % లోపే  ఉంది.) నిర్విరామంగా పరిపాలన సాగించడమేంటి ?  మన అమాయకత్వం కాకపోతే, ఇక్కడ మరో దౌర్భాగ్యమేమంటే ఆయా పత్రికలకు , మీడియా చానల్లకు మహరాజ పోషకులం కూడా  మనమే.
 
ఈ మీడియా సంస్థలు ఎంత తెలివైన వారంటే ప్రతి ఎలక్షన్ల ల కు ముందు తమ అనుకూల రాజకీయ పార్టీ నిర్దేశించే సున్నిత అంశాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వారిలో భావోధ్వేగాల్ని రెచ్చగొట్టడానికి వార్తలకు మసాలాలు బాగా దట్టించి వండి వార్చి మన అమాయకత్వాన్ని ఎంత బాగా క్యాష్ చేసుకుంటున్నారొ మీరు బాగా గమనిస్తూనే ఉన్నారు . ప్రతిరోజూ  బాగా మసాలాలు దట్టించిన వార్తల్ని చదివి చదివి మనలోని భావావేశం ఉప్పొంగి ఏరులై పారి నా రాష్ట్రానికి ఇంత అన్యాయం జరిగిపోతోందా! మా ప్రాంతం ఇంతటి నిరాధరణకు గురౌతోందా అని ఎప్పుడైతే ఈ అమాయక బహుజనులు రోడ్డెక్కడం మొదలెడతారో మిగతా స్టోరీనంతా ఈ అగ్రకుల పార్టీలు , మీడియా సంస్థలూ నడిపిస్తాయి.మనల్ని రోడ్లమీదకెక్కించి మన అమాయక జన సమూహాల్ని బూచిగా చూపి వారు తమ స్వప్రయోజనాల్ని బ్రహ్మాండంగా నెరవేర్చుకుంటారు . మరి వారి రాక్షస క్రినీడ లో ఇప్పటికీ బలిపశువులుగా మారుదామేమో బహుజన మేధావి వర్గం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి.
 
మనల్ని ఇంతగా రెచ్చగొడుతున్న ఈ మీడియా సంస్థల్ని ఒకే ప్రశ్న అడగండి. ప్రత్యేక హోదా సాధన కోసం మీ మీడియా సంస్థల పోరాటం అనిర్వచనీయం, అమోఘం , అత్యద్భుతం . మరీ 80% పైగా జనాభా ఉన్న బహుజనులకు రాజ్యాధికారం కోసం మీరెందుకు ఒక్క వార్తా కథనాన్ని ప్రచురించరు? ఒక్క వార్తనూ ఎందుకు ప్రసారం చేయరు? 5 % జనాభా ఉన్న కమ్మకులానికి 40 మందికి పైగా ఎమ్మెల్యేలు , 5 % లోపే జనాభా ఉన్న రెడ్డి కులానికి  40 మందికి పైగా ఎమ్మెల్యేలు,  6% జనాభా ఉన్న కాపు కులానికి 35 మందికి  పైగా ఎమ్మెల్యేలు అదే విధంగా ఈ మూడు కులాల నుండే మెజారిటీ ఎంపీ లూ ఏ విధంగా న్యాయం ?
 
ఇక్కడ జనాభా 80 % పైగా బహుజనులదైతే మరి డెబ్బై సంవత్సరాలుగా రాజ్యాధికారం ఈ మూడు కులాల చుట్టే పరిభ్రమించడం ఏ విధమైన ఆటవిక న్యాయం ?
 
మనమున్నది ప్రజాస్వామ్యంలోనా లేక దొరల పాలన లోనా ????? ఒకవేళ  ప్రజాస్వామ్యంలో ఐతే బహుజనులతో పోలిస్తే జనాభా పరంగా మైనార్టీ కులాలైన ఈ మూడు కులాల చేతిలోనే రాజ్యాధికారం నిక్షిప్తమై ఉండటమేంటి ?ఇదెక్కడి అన్యాయం? అని ఈ మీడియా సంస్థలు రోజూ ఊదరగొట్టరెందుకూ ? ఇది అన్యాయం కాదా? ఈ అన్యాయాలు మీ కళ్లకు కనబడవా ?  మీ కులాలకు నష్టం కల్గించేవేనా అన్యాయాలంటే? ప్రశ్నించడానికే ఈ భూమిపై ఉద్భవించిన పవన్ కళ్యాణ్ గారికి 6% శాతం జనాభా ఉన్న తన కాపు కులానికి ఇన్ని ఎమ్మెల్యే సీట్లు , ఎంపీ సీట్లూ , మంత్రి పదవులు ఎలా వస్తాయి?
 
జనాభా ప్రాతిపదికన మీ కులానికి రావాల్సిన ఎమ్మెల్యే సీట్లు 10 లోపే కదా మరి ఇంత మంది ఎలా ప్రాతినిధ్యం వహిస్తారు ? ఇది పక్కా అన్యాయం కదా ఆ సీట్లన్నీ జనాభా ప్రాతిపదికన బహుజన కులాలకు చెందాల్సినవి కదా అని ఎందుకు ప్రశ్నించడు. ఇదేనా సామాజిక న్యాయమంటే?
 
ఇక  ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సభ్యులంటూ ప్రచారంలోకి వచ్చిన అగ్రకుల మేధావులకు గత డెబ్బై సంవత్సరాలుగా బలహీన వర్గాలకు జరిగిన అన్యాయాలపై ఫ్యాక్ట్స్ కనబడలేదా ? అంటే మీ కులాలకు జరిగేవేనా అన్యాయాలు . ఈ డెబ్బై సంవత్సరాలలో మా బహుజనులకు  జరిగిన అన్యాయాలపై , రాజ్యాధికారంలో మాకు రావాల్సిన వాటాలపై ఫ్యాక్ట్స్ బయటకు తీయగలరా!
 
బహుజనలు చెయ్యాల్సిన పని  ఈ రాష్ట్రంలో రేపటి నుండి ఒక చర్చకు తెరతీయండి . రాజ్యాధికారంలో జనాభా ప్రాతిపదికన బహుజనులకు న్యాయంగా  రావాల్సిన వాటా ఎంత? కమ్మ ,రెడ్డి , కాపు కులాలకు దక్కాల్సిన వాటాలపై ధర్మబద్దమైన చర్చకు తెరలేవాలి .
 
స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలైనా ఈ మూడు కులాలనుండే ఒక్కో కులం వాడు 60, 70  మంది ఎమ్మెల్యేలు  ఉంటామంటే ఇక కుదరదు . కమ్మ కులం జనాభా దాదాపు  5 % . వారికి రావాల్సిన ఎమ్యెల్యేల వాటా 8 మంది లోపే . అదే విధంగా రెడ్డి కుల జనాభా దాదాపు 4 % ఉందనుకుంటే వారి వాటా 7 మంది ఎమ్యెల్యేలు , కాపు కుల జనాభా 7 % లోపేనని మొన్నీమధ్యే ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది .దాని ప్రకారం వారికి ఎమ్మేల్యే సీట్లలో రావాల్సిన వాటా 10  లోపే .అనగా ఈ మూడు కులాలకు 25 ఎమ్మెల్యే సీట్లు పోగా మిగిలిన 150 సీట్లు జనాభా ప్రాతిపదికగా SC.ST.BC. MINORITY , మరియూ ఇతర కులాలకే చెందాలి . అదే విధంగా 25  ఎం.పీ సీట్ల లో కమ్మ , రెడ్డి , కాపు కులాలకు ఒక్కో సీటు పోగా మిగిలిన 22 సీట్లు జనాభా ప్రాతిపదికన  SC ,ST , BC ,MINORITY మరియూ ఇతర కులాలకు చెందాలి .
 
పై ప్రాతిపదికన ఏ పార్టీ ఐతే  సీట్ల కేటాయింపు జరుపుతుందో ఆ పార్టీకే మా బహుజనుల మద్దతు ఉంటుంది తప్పితే హోదా నాటకాలు , పాదయాత్ర డ్రామాలూ , సామాజిక న్యాయం సినిమాలు , ఒక పార్టీ పది రాష్ట్రాలు సిద్దాంతం లాంటి పార్టీలకు కాదని తెలియచెప్పండి. ఇదే అంశంపై అగ్రకుల ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్రమంతా తిరిగి బహుజనులకు జరుగుతున్న అన్యాయంపై చర్చా కార్యక్రమాలు పెట్టమనండి . మూడు కులాలకే ఒక్కో కులానికి 60 ,70 ఎమ్మెల్యే  సీట్లు ఏ విధంగా న్యాయమో ప్రశ్నించి తమ ఊకదంపుడు నిబద్దతను నిరూపించుకొమ్మనండి .
 
రేపటి నుండే మనం మన కార్యాచరణ అనగా రాజ్యాధికారంలో న్యాయంగా , ధర్మంగా  మా వాటా ఏంటి ?  మీ వాటా ఎంత అని ప్రశ్నించడం ప్రారంభించక పోతే ఇంకో డెబ్బై ఏళ్లైనా మన బతుకులు ఇలాగే తగలెడింటాయి . మేలుకో బహుజన సోదరా! నీ మేధావితనంతో గుర్రెట్టి నిదరోతున్న నీ సోదర జాతుల్ని తట్టి లేపి వారిలో చైతన్యస్పూర్తి నింపు . ఈ జాతుల్లో పుట్టినందుకు ఇది నీ కనీస బాధ్యత .
 
 
 
(Visited 113 times, 1 visits today)
Also read  కులాధారిత రిజర్వేషన్లు ఇంకేనాళ్ళు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!