గద్దర్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం నేరమవుతుందా?

షేర్ చెయ్యండి
  • 115
    Shares

గద్దర్ తన కుటుంబ సభ్యులతో కలిసి  కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు  కలవడం వివాదస్పదమైన అంశంగా మారింది. ప్రజా యుద్ధ నౌక గా పేరు గడించిన ఒకప్పటి పీపుల్స్ వార్ సాంస్కృతిక రధ సారధి గద్దర్ నేడు ప్రజాస్వామ్య బద్దంగా  ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్దమవడంతో ఇది దళిత – బహుజన వర్గాల్లో చర్చనీయాంశముగా మారింది. 

ఒకప్పుడు తుపాకీ గొట్టం ద్వారా  రాజ్యాధికారం సాధిస్తాం అని గత మూడు దశాబ్దాలుగా విప్లవ పంధాలో పోరాటం చేసి నేడు బాబాసాహెబ్ డా అంబేడ్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కుద్వారా  మాత్రమే తాడిత, పీడిత వర్గాలకు రాజ్యాధికారం లభిస్తుందని ఎన్నికల బరిలో దిగుతున్నారు!  
 
తన ఆటా, పాట ద్వారా ఎందరో యువతీ యువకులను విప్లవం వైపు నడిపిన గద్దర్ నేడు ఆ విప్లవం ఒక బూటకం అని చెప్పకనే చెప్పేరు. 
 
Gaddar_rahul gandhi
Image: Revolutionary poet Gaddar & Congress president Rahul Gandhi. Curtacy: PTI
గద్దర్ తీసుకున్న ఈ నిర్ణయంకు కారణం ఏమిటి? 
 
మావోయిజం లో లేదా విప్లవం లో  దళిత కుల దృక్పధం లేదా?  విప్లవం ఆచరణలో వర్గ పోరాటంలో కుల పోరాటాన్ని జోడించే దృక్పధం లేకపోవడమా? తాడిత పీడిత కుల పోరాటానికి మూలమైన బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ ఆలోచనా విధానం పూర్తిగా మావో ఇజం లేదా విప్లవ, కమ్యూనిస్ట్ పార్టీలు తిరస్కరించేరా?  ఇండియాలో ఏమి జరుగుతుంది? ఇండియా లో ఏమి చెయ్యాలి?
 
సిపిఐ ( యం ఎల్ ) జన శక్తి  శిభిరంలో 1994 లో కుల పోరాట సిద్ధాంతం ఫై పూలె – డా అంబేడ్కర్ ఆలోచనా విధానం పై జరిగిన సిద్ధాంత  చర్చ ఆ పార్టీలో విభేదాలకు దారితీసి పార్టీలో అంతర్గత సంక్షోభానికి దారితీసింది. 
 
బారత దేశంలో బ్రాహ్మణీయ కుల వ్యవస్థ పై చర్చ లేకుండా, వారు రూపొందించిన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ నిర్ములన జరగకుండా విప్లవం కానీ, సోషలిజం కానీ లేదా కమ్యూనిజం విజయం చెందలేదు. 
 
బ్రాహ్మణిజం యొక్క బావజాలం ఆధునిక దశలో దళిత వర్గాలను బహుజనులను మభ్యపెట్టి మధ్యేవాదం ముందుకు తీసుకువస్తూ దళితుల పోరాటాన్ని నీరు గారుస్తున్నారు. 
 
ఆధునిక దళిత వాదాన్ని స్పష్టంగా నిరాకరించకుండా, స్వీకరిస్తునట్లు నటిస్తూ , మభ్యపెట్టే నయా సంప్రదాయం మార్మికవాద, మధ్యేవాదం మరీ ప్రమాదకరంగా తయారైంది. 
 
ప్రపంచీకరణ ముసుగులో ఆధునిక బ్రాహ్మణిజం తడిగుడ్డలతో గొంతు కొస్తుంది. కులాల మధ్య విభజన రేఖలు గీస్తూ  అగ్రకులాబావజాలం, ఆధిపత్యన్ని శిరసావహించేలాగా బ్రాహ్మణిజం మావోయిజం లో, విప్లవంలో , కమ్యూనిజం లో , సోషలిజం లో అంతర్గత ప్రణాళికలు రచించి దళిత – బహుజన వర్గాల మెడ మీద కత్తిని వ్రేలాడ దీసింది. 
 
సమకాలీన సమాజంలో వచ్చిన సామాజిక మార్పుల్ని సకాలంలో ఆకళింపుచేసుకుని సామాజిక శక్తులను సామాజిక దృక్పధంతో విప్లవం నాయకత్వం పోరాడకుండా పిడి వాదంతో అగ్రకుల భావజాల ఆధిపత్యమే కొనసాగిస్తూ పలాయనా వాదంలో విప్లవం దళితులను మోసం చేస్తుంది. 
 
విప్లవం లో కుల దృక్పధం లేకపోవడం కుల పోరాటం లేకపోవడం తో 1994 లో  “మే 17 కామ్రేడ్స్”  గా ఆరోజు మారోజు వీరన్న బయటకు వస్తే నేడు గద్దర్  ప్రజాస్వామ్య ఎన్నికల బరిలోకి దిగటం ఒక విధంగా ఆహ్వానించదగ్గ పరిణామం. 
 
అగ్రకుల మావోయిస్టులు – డా . అంబేడ్కర్!
 
“సత్యాలను వాస్తవాల నుండి గ్రహించాలి – మావో సేటుంగ్”
 
బాబాసాహెబ్ డా.బి ఆర్.అంబేడ్కర్ అన్నపేరు కేవలం ఒక వ్యక్తి పేరు మాత్రమే కాక అది ఒక చైతన్యానికి ప్రతీకగా తాడిత,పీడిత కులాల చైతన్యంగా , కోట్లాది ప్రజా సమూహాలను సంఘటిత పరిచే శక్తిగా బారతీయ  మావో -లెనినిజం గుర్తించలేక పోవడానికి కారణం బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ నిమ్నజాతీయుడు కావడమే. 
 
1996 జులై- ఆగస్టు ‘ఈనాటి ఏకలవ్య’ సంచికలో “అంబేడ్కర్ పీడిత కులాల మనిషి కాదు” అన్న శీర్షికతో పీపుల్స్ వార్ గణపతి వర్గం  నాయకులు వెంకటరాం పేరుతొ ప్రచురితమైన వ్యాసంలో డా. అంబేడ్కర్ సామ్బ్రజ్య వాద మనిషిగా చిత్రీకరించేరు. 
 
బాబాసాహెబ్ విదేశాల్లో చదువుకున్నా అందరిలాగా  మార్క్స్ – లెనిన్ – మావో విధానాలకు ఆకర్షితులు కాకుండా కమ్యూనిజాన్ని అసహ్యించుకున్నారని , రష్యాలో వచ్చిన అక్టోబర్ విప్లవం డా. అంబేడ్కర్ ని ఆక్రోశించలేక పోయిందని ఆరోపణలు చేసేరు. 
 
వెంకటరాం చేసిన ఇంకొక ప్రధాన ఆరోపణ డా. అంబేడ్కర్ రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరవ్వడం మరియు సైమన్ కమీషన్ ని వ్యతిరేకించక పోవడం తో డా. అంబేడ్కర్ ని  విప్లవకారులు దేశ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేసేరు. 
 
ఈ ఆరోపణలే మావోయిస్టు ల ద్వంద వైఖిరిని మరోసారి  బయట పెట్టింది. తాడిత పీడిత ప్రజలకోసం తుపాకీ గొట్టం ద్వారా విముక్తి కలిగిస్తాం అంటూ వందలాది దళిత , ఆదివాసీ , బహుజన యువతను బుల్లెట్లకు బాలి ఇచ్చిన అగ్రకుల మావోయిజం.
 
డా. అంబేడ్కర్ బారత గడ్డ మీద జీవిస్తున్న అశేష పీడిత ప్రజానీకానికి వేలాడుతున్న సంకెళ్లు ను ఎలా తొలగించాలో ఆలోచన చేసేరు, అందరూ స్వాతంత్య్రం గురించి ఆలోచిస్తే డా. అంబేడ్కర్ స్వాతంత్య్రం తరవాత నిమ్నజాతుల , కులాల పరిస్థితి గురించి ఆలోచన చేసేరు. 
 
మావోయిస్టు ల పోరాటం తాడిత, పీడిత కులాల కోసమైతే బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరు అయితే సామ్రాజ్యవాద శక్తి ఎలాగయ్యేడు.?
 
భారత దేశానికి వచ్చిన సైమన్ కమీషన్ నిమ్న కులాల / జాతుల పరిస్థితిని అధ్యయనం చెయ్యటానికి వస్తే మావోయిస్టు లు బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ సామ్రాజ్యవాది ఎలాగు అయ్యేడు. 
 
కాబట్టి బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ అన్నట్టు ఈ దేశంలో ఏ దిక్కు కు వెళ్లినా కులం అనేది మనకి స్వాగతం చెబుతుంది.  కాబట్టి విప్లవ గీతాలను పాడిన గద్దరన్న నేడు స్వతంత్ర అభ్యర్థి గా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బరిలోకి దిగటం తప్పు ఎలా అవుతుంది? 
 
డా. అంబేడ్కర్ ఆలోచనా విధానం లేకుండా సామజిక విప్లవం సాధ్యమా? 
 
బారత దేశంలో ( వర్గం ) భూస్వామ్యమంటే కుల దొంతరల నిచ్చెనమెట్ల ఆధారంగా  “నిర్మితమైన బ్రాహ్మణీయ కుల దోపిడీ భూస్వామ్య వ్యవస్థే బారత దేశంలో ఫ్యూడల్ దొరల, బూర్జువా ఆశక్తులున్న విద్యావంతులు సాగించిన జాతీయోద్యమాన్ని ప్రగతిశీలమైందిగా గుర్తించిన కమ్యూనిస్టులు, బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ నాయకత్వంలో బారత సామజిక విప్లవ శక్తులైన దళితులు సాగించిన భూస్వామ్య వ్యతిరేక కుల నిర్ములనా పోరాటాలను గుర్తించలేకపోవడం  నిజంగా విషాదకరమైన విచిత్రం.” అంటారు ప్రముఖ కవి, సాహిత్యకారుడు “యువక” కలేకూరి ప్రసాద్   
 
అంతేకాదు, హిందూ సామాజిక వ్యవస్థ నుండి ఉత్పన్నమవుతున్న కులం అడ్డుగోడలు కమ్యూనిస్ట్ వర్గ విప్లవాన్ని  అడ్డుకుంటూ అడ్డంకులు కల్పిస్తున్నాయని  కూడా స్పష్టమౌతుంది. అందుకే బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ “కమ్యునిజానికి హిందూ సమాజిక వ్యవస్థనుండి అడ్డంకులు విప్లవానికి ప్రతిబంధకంగా ఉన్నాయని సృష్టం చేసేరు.”  
 
బారతీయ కమ్యూనిస్టులు, విప్లవకారులు ఆ అడ్డంకులను అధిగమించటానికి వర్గే తర ప్రత్యేక కుల పోరాటాన్ని నిర్మిచాల్సిన ఆవశ్యకతను గుర్తించకుండా, కుల అడ్డుగోడలు అడ్డం కాదని బకాయిస్తే కుదరదని స్పష్టం చేసేరు. 
 
“ఇండియాలో విప్లవ ప్రతిబంద కరమైన బ్రాహ్మణీయ సామాజిక వ్యవస్థని యధాతధంగా అలాగే ఉంచి ఆయధాతధ “కులం పునాదుల మీద ఒక జాతినిగానీ నిర్మించలేం” అని బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ చెప్పిన దాని ప్రకారం బ్రాహ్మణేతర దళిత , బహుజన సామాజిక ప్రజాస్వామ్యాన్ని కుల పోరాట పునాదుల మీద మాత్రమే కుల నిర్ములనా పోరాటాన్ని నిర్మించగలం.” అన్నారు  మే 17 కామ్రేడ్ ‘మారోజు వీరన్న 
 
గద్దర్ కూడా కీలు బొమ్మేనా  ( చెంచా )!
 
గద్దర్ అంటే ప్రజా యుద్ధ నౌక, గద్దర్ అంటే విప్లవ గీతం, విప్లవోద్యమం మరి అలాంటి గద్దర్ ఎర్ర జెండా వదిలి కాంగ్రెస్ అధ్యక్షుడిని కలవడం ఇప్పుడు నేరం అయ్యిందా? గద్దర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారా? 
 
భూర్జువా పార్టీలకు వ్యతిరేకంగా తాను రాసి, పాడి, ఆడిన గద్దర్ నేడు అదే భూర్జువా పార్టీల మద్దత్తు కోరడం ఒక్కింత ఆచ్చర్యం కావొచ్చు. గద్దర్ విప్లవకారుడు గా కంటే ఇప్పుడు ఒక దళితుడు గా చూడాలి.   
 
దళిత నాయకులు ఎందరో లోపాయికారీగా ప్రాంతీయ కుల పార్టీల పల్లకీ మోస్తుంటే గద్దర్ జాతీయ పార్టీ పల్లకీ మోయడం కూడా సబబు గానే ఉంటుంది. ఎటొచ్చి విప్లవం ఒక బూటకం అని నిర్ణయం అయిన తర్వాత  గద్దర్ అనే శక్తి కాంగ్రెస్ తో కలిస్తే ఆచ్చర్యపడాల్సిన అవసరం లేదనిపిస్తుంది. 
 
దళితుల ఉమ్మడి శత్రువు బ్రాహ్మణిజం – హిందుత్వం. తెలుగు రాష్ట్రాల్లో దోపిడీ కులాలు ప్రాంతీయ పార్టీల ద్వారా హిందుత్వమే జెండా, అజెండా గా , మనువు ని ముందు పెట్టి పాలిస్తున్న RSS – BJP పార్టీ ని సమర్థిస్తున్న తెరాస, తెలుగు దేశం పార్టీ , వై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ , జనసేన పార్టీలను కాదని బిజెపి వ్యతిరేక పార్టీ అయిన కాంగ్రెస్ మద్దత్తు కోరడం పెద్ద నేరం కాదు. 
 
“పూనా ఒప్పందం అమలులోకి వచ్చి ఉమ్మడి నియోజక వర్గాలు, రిజర్వుడ్ సీట్ల విధానం మొదలగు అంశాలవల్ల అణగారిన కులాల పరిస్థితి మరింత దిగజారుతుంది. ఇది కేవలం నా ఊహామాత్రమే కాదు. 1946 లో జరిగిన ఎన్నికలు నిరూపించిన దాన్నిబట్టి ఉమ్మడి నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే అణగారిన కులాలు ఓటు హక్కును దాదాపుగా కోల్పోయినట్లే లెక్క ” బాబాసాహెబ్ డా. బి ర్ అంబేడ్కర్ 
 
పూనా ఒడంబడిక జరిగిన తర్వాత దళిత వర్గాల్లో రాజకీయ, సామాజిక చెంచాలకు పునాది పడిందని మాన్యశ్రీ కాన్షిరాం తన చెంచాయుగం పుస్తకం లో పేర్కొన్నారు. గద్దర్ దళిత – బహుజన పార్టీ లలో చేరకుండా లేదా తనకు ఉన్న గ్లామర్ తో దళిత పార్టీ పెట్టకుండా కాంగ్రెస్ తో చేతులు కలపడం అంటే గద్దర్ కూడా చెంచా క్రిందకు వస్తాడా? 
 
దాదాపు గా ఎనిమిది దశాబ్దాల పూనా ఒప్పందం తర్వాత, ఆరు దశ్శబ్దాల బాబాసాహెబ్ డా అంబేడ్కర్ దళిత సమాజాన్ని శాశ్వితంగా వదిలి వెళ్లిన తర్వాత  దళిత యువత లో , దళిత సమాజంలో పెరుగుతున్న “రాజ్యాధికారం”  ఆశలు గద్దరన్న ఓట్ల రాజకీయం లోకి వచ్చిన తర్వాత ఎర్ర జెండా కాదు నీలి జెండానే దళితుల జెండా అని మరోసారి రుజువైంది. 
 
విప్లవాన్ని వదిలిపెట్టిన వారిలో గద్దరన్న మొదటి వాడు కాదు, చివరి వాడు కాదు. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుడు ‘నల్ల సూర్యుడు ‘ శివ సాగర్ లాంటివారు విప్లవం కాదు అంబేద్కరిజం దళితుల బాటని బహుజన రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. ఓట్ల రాజకీయం లోకి వచ్చిన వ్యక్తి. 
 
దళితుల రాజ్యాధికారం ఒకడుగు ముందుకు, పది అడుగులు వెనక్కి వెళుతున్న క్రమంలో గద్దరన్న ఓట్ల రాజకీయం ఆటలో బరిలోకి దిగటం ఆహ్వానించదగ్గ పరిణామమే!
 
ఎందరో దళిత మేధావులు, ఉద్యమకారులు మాదిరిగా గద్దరన్న కూడా చెంచాగా మారిపోతాడా లేక తన అస్తిత్వాన్ని కాపాడుకుంటాడో కాలమే సమాధానం చెబుతుంది. అప్పటివరకూ వేచిచూద్దాం!  
 
 
 
(Visited 283 times, 1 visits today)
Also read  కమ్యునల్ అవార్డు ని అడ్డుకుని గాంధీ హిందూ మతాన్నికాపాడేడా లేక దళితులకు ద్రోహం చేసేడా?

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!