దళితుల ఐక్యత రాజ్యాధికారం ఎండమావేనా!

షేర్ చెయ్యండి
  • 98
    Shares

 

భిన్న జాతుల సమూహమైన భారత ఉపఖండంలో అనేక సముదాయాల మధ్య సమన్వయ సహజీవనం 21 వ శతాబ్దంలో కూడా కష్టంగా కనిపిస్తుంది. సమాజంలో నివసించే సముదాయాల్లో స్వంత ఆస్తి, మేధోపరమైన అభివృద్ధి లో విపరీతమైన తారతమ్యాలుండటం తెలిసిందే. ఈ తారతమ్యాలకు కారణం కులం, కుల వ్యవస్థ. 

కుల వ్యవస్థ యొక్క అవలక్షణానికి ప్రామాణికం అంటరానితనం. అంటరాని వారీగా వేల సంవత్సరాల నుండి వివక్షకు గురవుతున్న ఒక సముదాయం లోని వ్యక్తులు పుట్టినా, పుట్టకపోయినా, బతికినా, బతక కపోయినా, మరణించినా, మరణిస్తున్నా ఈ దేశంలో పట్టించుకునే దిక్కు లేదు. 
 
నిర్జీవమైన ఒక సముదాయాన్ని బాబాసాహెబ్ డా అంబేడ్కర్ అనే దార్శినికుడు చైతన్య పరచి హక్కులు కల్పించి, ప్రత్యేక రాయతీలు ఇచ్చి రాజ్యాధికారం లో భాగస్వామ్యం అయ్యేంతవరకూ మీకు అభివృద్ధి జరగదని చెప్పిన మహానుబావుడు. 
 
అంటరానివారి నుండి ఎస్సి లుగా మారిన ఈ సమూహం ఇంకా నడక నేర్చుకునే క్రమంలోనే ఉంది. ఇక దళితుల ఐక్యత రాజ్యాధికారం ఎండమావేనా  అంటే అవును అనే సమాధానం వస్తుంది.
 
దళితులు – చరిత్ర!
 
అంటరాని కులాలను ఎస్సి ( షెడ్యూల్ కులం ) లు అనే ఒక గొడుగు క్రింద ఉంచే ప్రయత్నం చేశారు బాబాసాహెబ్ డా. అంబేడ్కర్. అయితే ఆ మహానుబావుడే ఈ ఎస్సి ల అనైక్యతను చవిచూశారు. అయన మీదనే కొందరు తిరుగుబాటు చేశారు. 
 
ఈ నైక్యతకు కారణం అణిచివేతకు గురైన వ్యక్తులకు జ్ఞానం లేకపోవడమే కారణమని తెలుసుకున్నారు. బ్రహ్మణ కుల వ్యవస్థ యొక్క రాజకీయ ఎత్తుగడలు, దోపిడీ అవగాహన చేసుకునే  చైతన్యం లేదనుకుని ” బోధించు , పోరాడు, సమీకరించు” అనే మూడు సూత్రాలను ఎస్సి లకు ఇచ్చివెళ్లారు. 
 
ఎస్సి లు – దళితులంటూ పిలవబడుతున్న ఒక సమాజం ఈ దేశ సంస్కృతికి, కుట్రలకు బలైపోయిన ఒక జాతి. ఈ గడ్డ మూలవాసుల జాతి. 
 
” తరతరాల అంటరాని జీవితాలకు వారసులు వాళ్ళు. వాళ్ళ పూర్వికులు ఊరవతల విసిరేయబడ్డారు. అంటరానివాళ్ళుగా బతికారు. 
 
అవును, 
అట్టాగే బతికారు. అట్టా ఎందుకు బతకాల్సివచ్చిందో వాళ్లకి తెలీదు. 
చరిత్ర తొలిదశ మాట. అప్పుడు రాజ్యాలు పాలించారట. 
రాజులు పాలించినట్లు, బ్రాహ్మణులు పాలించినట్లు, రెడ్లు పాలించినట్టు, అట్టా అనేక కులాలు పాలించినట్టు. 
 
వెతికితే ఆధారాలు దొరక్కపోవు. కానీ వెతికిన జాడ కన్పించదు 
వెతికినా వెతికినదంతా ముందేసుక కూర్చొంటే అంతా దోపిడీ వర్గాల వక్రీకరణ. అగ్రకుల పరిశోధకుల స్వీయ మానసిక కంపు, అంతే. 
 
విషాదమంతా ఎట్టా ఉందంటే. 
ఈ చరిత్రకు మట్టివాసన, మనిషి వాసన తక్కువ. 
చంద్రప్ప అన్నట్టు, నాగన్న అన్నట్టు అంతా మట్టి దిబ్బలు. గుంటలు, గోతులు, లోయలు. 
 
ఏ గోతిలో ఏ వాస్తవం విసిరేయబడ్డదో తెలీదు  
ఏ మట్టి దిబ్బ కింద ఏ బతుకులు శాశ్విత సమాధులయ్యాయో లెక్కలేదు. 
ఏ ఏ లోయలో ఏ నాగరికత ఉరితీయబడ్డదో అర్ధం కాదు. 
మట్టిమీద ఆధిపత్యం. 
మనుషుల్ని నిర్ధాక్షిణ్యంగా వేరుచేసి అణిచివేసిన కౌటిల్యం. 
వర్గం.  
కులం.
విసిరేయబడ్డ బతుకులు. 
సమాధి చేయబడ్డ బతుకులు. 
ఉరితీయబడ్డ నాగరికతలు. 
మాలలు, మాదిగలు 
వాళ్ళు రాజవీధుల్లో నడవలేదు 
ఊరిబావుల్లో  నీళ్లు తాగలేదు. 
మెడకు ముంత, ముడ్డికి తాటాకు. మనుషులే. రెండు కాళ్ళు, రెండు చేతులు, ఒక మెదడు అందరిలాగే. 
బాపనాళ్లకులాగే, రెడ్లకులాగే, కమ్మవాళ్లకు లాగే, ఇంకా చాలామంది అగ్ర కులాల వాళ్లకు లాగే. 
మనుషులే, మెదళ్లే 
తమిళ దేశంలో పెరియాలు 
కన్నడం లో హోళీలు 
మహారాష్ట్ర లో మాంగ్ లు, మహార్లు, భంగీలు, చమార్లు. 
తెలుగు లో మాలలు, మాదిగలు. 
అట్టా చాలా చోట్ల ఈ దేశం ప్రతిమూల 
ఈ పవిత్ర భారత దేశంలో, అపవిత్రంగా అసహ్యింగా చూడబడ్డవాళ్లు, అంటరానివాళ్ళు ‘
మాలలు , మాదిగలు 
 
ఈ దేశ సంస్కృతికి సిగ్గులేదు. ఉన్నదల్లా కుట్ర. ఈ దేశం సంస్కృతికి నిజాయితీ లేదు ఉన్నదల్లా మోసం. ఇక్కడ వేదం, మతం, మనువు, సహనం, సామరస్యం అన్నీ కుట్రకి , మోసానికి పర్యాయపదాలు.”
 
అంటరాని వసంతం లో జి కళ్యాణ్ రావు గారు చెప్పిన సత్యం. అనాదిగా ఈ దేశ కుల సంస్కృతికి, కుట్రలకు భలైన చరిత్ర 
 
దళితులు – ఫ్యూడల్ కుల  వ్యవస్థ! 
 
భారత ఉపఖండంలో అణిచివేయబడిన వారు దళితులు.గ్రామీణ ప్రాంతాల్లో భూస్వామ్య వర్గాలు బ్రాహ్మణ కుల వ్యవస్థను పెంచిపోషించి దళితుల హక్కులు కాలరాయడంలో ముందు ఉన్నారు. 
 
బ్రాహ్మణీయ మరియు భూస్వామ్య  వ్యవస్థ కలిసి సామాజికంగా దళిత వర్గాలను విద్య నుండి, భూమి నుండి వేరు చేసి వారి మీద ఆధారపడే విధంగా చేసేరు. మనువు సృష్టించిన అనాగరిక కుల న్యాయం లో దళితులకు దేనిమీద హక్కులు లేకపోవడం తో స్వతంత్రంగా బతికే అవకాశం లేదు. 
 
ఎప్పుడైనా ,  ప్రశ్నించిన వారిని గ్రామాల నుండి బహిష్కరించడం, బహిరంగంగా కొట్టడం, చంపడం లాంటివి చేస్తూ భయబ్రాంతులకు గురిచేసేరు. కట్టు బాట్లు దాటితే దేవుడు , దేవత ల ఆగ్రహానికి గురి అవుతారని భయ పెట్టేరు. 
 
బాబాసాహెబ్ డా అంబేడ్కర్ ఈ కుట్రలు ఛేదించి మొట్ట మొదటిసారిగా 1932 లో నిమ్న కులాలకు, జాతులకు ( ఎస్సి , ఎస్టీ ) లకు రాజకీయ హక్కులు కల్పించారు. ఈ కులాల రాజకీయ హక్కులను గాంధీ అనే కుల వ్యవస్థ ప్రతినిధి అడ్డుకోవడం జరిగింది. 
 
సెప్టెంబర్ 24, 1932 నుండి ఎస్సి , ఎస్టీ లలో కీలు బొమ్మలు ఆవిర్భవించడం జరిగింది. పేరుకు దళిత ప్రతినిధులే కానీ వీరిని నడిపించేది భూస్వామ్య కుల వ్యవస్థ. వారి దగ్గర పని చేసే పాలేరులే రాజకీయ కీలు బొమ్మలు. ఇక్కడ కూడా  దళితుల ఐక్యత రాజ్యాధికారం ఎండమావేనా అంటే అవును అని సమాధానం వస్తుంది. 
 
బాబాసాహెబ్ డా అంబేడ్కర్ ఈ సమస్య పరిష్కారం చెయ్యాలని  హిందువు నుండి బౌద్ధ ధర్మం లోకి తన జాతిని మారమని 5 లక్షల మంది తో అక్టోబర్ 14, 1956 లో దళిత వర్గాల సమస్యకు పరిష్కారం చూచించారు. 
 
ఒక ఇస్లాం వ్యక్తి మీద దాడి జరిగితే ప్రపంచ వ్యాపతంగా ముస్లిం లు స్పందిస్తారు, అలాగే సిక్కులు. కానీ హిందు కుల వ్యవస్థలో భాగం చేసిన దళితుల మీద దాడి జరిగితే మిగతా హిందువులు స్పందించరు, క్రిస్టియన్స్ స్పందించరు. 
 
అణిచివేయబడిన కులాలను  ప్రత్యామ్నాయ సంస్కృతి ద్వారా ఏకీకరణ సాధించవచ్చు అనే అభిప్రాయంతో బాబాసాహెబ్  బుద్ధిజం ఒక మార్గం ఎన్నుకున్నారు  దురదృష్టవశాత్తు దళిత సమాజం ఐక్యత కొరకు ఈ మార్గాన్ని ఎన్నుకోవడంలో కూడా విఫలం అయ్యేరు. 
 
దళితులు – పెట్టుబడిదారీ వ్యవస్థ!
 
భారత దేశంలో 1992 నుండి నూతన ఆర్ధిక విధానాలకు శ్రీకారం చుట్టారు. ప్రపంచీకరణ, పెట్టుబడిదారీ విధానం తో వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. 
 
రాజకీయ వ్యవస్థ లో పెట్టుబడిదారుడు ప్రవేశించి ఐదేళ్లకు ఒక్కసారి ఓటర్లను కొనే ప్రక్రియ ప్రారంభించారు. సాంఘిక అభివృద్ధి మరచి వ్యక్తులు చుట్టూ వ్యవస్థ తిరిగే విధంగా వ్యూహాలు రచించుకున్నారు. 
 
భూస్వామ్య కుల వ్యవస్థ పెట్టుబడిదారీ వ్యవస్థ గా మారి ప్రజలను వారి మీద ఆధారపడి విధంగా మార్చుకున్నారు. జన్మ భూమి కమిటీలు వేసి తమ పార్టీ ఓటర్ల కే సంక్షేమ పధకాలు ఇస్తూ  ప్రజా వ్యవస్థ ను నిర్వీర్యం చేశారు. 
 
దళితుల ఐక్యత, రాజ్యాధికారం ఎండమావేనా!
 
చరిత్ర నుండి నేటి వరకూ దళిత సమాజం పాఠాలు నేర్చుకోలేదు. ముక్యంగా దళిత నాయకత్వం కుల రాజకీయ వ్యవస్థ కుట్రలు అర్ధం చేసుకోవడంలో విఫలం అవడమే కాకుండా వీరే వారికి తాబేదారులుగా ఉన్నారు. 
 
 దళిత నాయకత్వం లో సూత మహార్షులే ఎక్కువగా   ఉన్నారు. భరోసా ఇవ్వలేని  నాయకత్వం, విశ్వనీయత లేని నాయకులు వలన దళిత సమాజం పదే పదే మోసపోతుంది. వీరి తప్పులను దిద్దుకోవడానికే అన్నట్లు గా దళిత ఓటర్లు అమ్ముడు పోతారు, ఐక్యంగా ఉండరు, అనే నిందలు వేసి ప్రజలను వదిలేసారు. 
 
ఎన్నికల సమయంలో వచ్చి ఓట్లు వేయాలనడం లేకపోతె అమ్ముడు పోయారు అనడం ఫ్యాషన్ గా మారింది. 
 
గ్రామ స్థాయి నుండి రాజకీయ వ్యవస్థను నిర్మించకుండా, వారి సామజిక అవసరాలకు తోడ్పాటు అందించకుండా ఎన్నికల్లో ఓట్లు వేయాలంటే ఎలా వేస్తారు? పెట్టుబడి దారుడు రేషన్ కార్డు నుండి ఆరోగ్యశ్రీ , కల్యాణ లక్ష్మీ , బర్రెలు , గొర్రెలు , ఆటోలు, పెన్షన్ పధకాలనీ వారి రాజకీయ ఏజెంట్ ద్వారా కావాల్సిన వారికి ఇస్తారు. 
 
దళిత నాయకత్వం ప్రభుత్వ పధకాలు ప్రతి ఒక్కరికీ చేరేవిధంగా పనిచేయాలి అలా కాకుండా వీళ్ళే వర్గాల గా విడిపోయి పెట్టుబడి దారుల కూటమి లో భాగస్వామ్యం అవుతారు. 
 
రాజకీయ వ్యూహం లేని దళిత పార్టీ లు నాయకులు ఎన్నికల రోజు ఓటు కోసం వెళ్తే ఐదు సంవత్సరాలు ఆధారపడిన తమ యజమానిని మోసం చేసే మనస్తత్వం లేని దళిత ప్రజలు దళిత పార్టీ లకు, అంబేద్కరిస్టు లకు ఓటు వేయరు. 
 
అట్రాసిటీ ఉద్యమాలు రాజకీయ ఉద్యమాలు గా రూపాంతరం చెందాలంటే కుల సంఘం నాయకుడు రాజకీయ నాయకుడుగా మారాలి. లేదంటే అట్రాసిటీ ఉద్యమకారులకు ఓట్లు పడవు 
 
దళితుల మధ్య ఐక్యత సాధించాలంటే రెండే రెండు మార్గాలు 1. రాజకీయ నాయకత్వం భరోసా కల్పించడం. 2  ప్రత్యామ్నాయ సంస్కృతి ని అభివృద్ధి చేయడం 
 
అప్పటి వరకూ దళితుల రాజ్యాధికారం , ఐక్యత ఎండమావి గానే ఉంటుంది. 
 
 
 
(Visited 234 times, 1 visits today)
Also read  క్రోనీ క్యాపిటలిజం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!