బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ ఆలోచనా విధానం-ఒక వర్తమాన విశ్లేషణ 

షేర్ చెయ్యండి

ఈనాడు బాబాసాహెబ్ డా.అంబేడ్కర్  భక్తులు పెరిగిపోతున్నారు. ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో కొన్ని గ్రూపులు బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ ను ఇప్పటికే దేవుడిగా మార్చేశాయి. విగ్రహాల స్థాపనలు, పూజాదికాలు మొదలుపెట్టేశాయి. అన్ని పార్టీలూ ఆయన భజన చేస్తున్నాయి.

కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడో ఒటుబేంక్ రాజకీయాలకోసం బాబాసాహెబ్ భజన చేస్తుండగా, ఇప్పుడు బీజేపీతోసహా మనువాద విలువలను తమ భావజాలంగా కలిగిఉన్న సంస్థలన్నీ పోటీలు పడిమరీ బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ జయంతులు, వర్దంతులంటూ తెగహడావిడి పడుతూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయనను ‘జాతి ద్రోహి’ అనీ ‘బ్రిటీష్ ఏజంట్’ అనీ నిన్నటిదాకా తిట్టిన వీరంతా, నేడు బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ ను బడుగు జనాల గుండెల్లోంచీ చేరిపివేయలేమనీ, అర్ధం చేసుకున్నారు. పీడిత కులాల ఓట్లకోసం వీరంతా బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ ను ఆకాశానికి ఎత్తుతున్నారు. బాబాసాహెబ్ గొప్ప దార్శనికుడైన మేధావి అనీ, సమాజాన్నీ, దేశాన్నీ ఉద్ధరించాడనీ, మత పీటాదిపతులు, రాజకీయ పార్టీల నుంచీ, ఐక్యరాజ్య సమితి దాకా హోరెత్తిస్తున్నారు. ఒవైపున ఆయన మనుస్మ్రుతిని దహనం చేసిన విషయం తెలిసి కూడా ఆయనను ‘అభినవ మనువు’ గా కీర్తింపజేశారు. 

ఇక బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని, ప్రధాని నరేంద్రమోడీ “బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ అంతర్జాతీయ సంస్థ” కు ప్రారంభకార్యక్రమం చేస్తే, బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ ఆలోచనా స్రవంతిని 125 అడుగుల లోతుకు భూస్థాపితం చేసే క్రమంలో,రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ, పోటాపోటీగా 125 అడుగుల బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ విగ్రహాలకు శంఖుస్థాపనలు చేశారు. బాబాసాహెబ్ ను గురించి ఏ కొంచం తెలిసినవారికయినా, ఈ ప్రధాని, ముఖ్య మంత్రులు బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ ఆలోచనా విధానానికి స్పష్టమైన వ్యతిరేకులని తెలుసు. అయినా అనేక కార్యక్రమాల్లో బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ బొమ్మలకు, ఫోటోలకూ కుంకుమ బొట్లు పెట్టి ఆయన్నో హైందవ ప్రతినిధిగా చూపుతున్నారు. ఇక్కడ ఇంకా ఆశ్చర్యకరమైన విషాద ఘట్టాలు చోటుచేసుకున్నాయి. తాము దళిత నాయకులమనీ, బుద్ధిస్టులమనీ, అంబేడ్కరిష్టులమనీ, చెప్పుకునే అనేకమంది; దీప ధూప నైవేద్యాలు, వేదపండితుల మంత్రోచ్చారణలమధ్య జరిగిన ఈ కార్యక్రమాలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని అధికార గణాలకు విధేయత చాటుకున్నారు.

బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ ను ఆయా పార్టీలకు చెందినవారిగా ప్రజానీకం మనస్సులో ముద్రపడేందుకు కారణ మయారు. ఈ ఉపఖండానికి వలసవచ్చిన ఆర్య పూజారి వర్గం బుద్ధుడి విషయంలో ఏ విధంగా ప్రవర్తించి సొంత గడ్డపై నుంచీ ఆయన బోధనలను తరిమికొట్టే ప్రయత్నం చేశారో, బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ ఆలోచనా విధానాన్నీ అలానే చేసేందుకు జరిగేకుట్ర ప్రయత్నాల్లో భాగంగానే వీటిని చూడాలి. అందుకై బౌద్ధం పట్ల వారు అనుసరించిన ఎత్తుగడలను గురించి కుడా తెలుసుకోవాల్సి ఉంటుంది. 

వ్యవసాయం స్థిరీకృతమవుతున్నసామాజిక దశలో, ఆర్య పురోహిత వర్గం వ్యవసాయం చేసేందుకు ప్రధానమైన ఆలంబనగా ఉండిన పశువుల్ని విచ్చలవిడిగా వధించి, పశుమాంసం, సురాపానాలతో విందులు చేసుకునేవారు. అనేక యజ్ఞాలకు సంబంధించిన తంతులను వివరించే పురాతన సంస్కృత శ్లోకాలద్వారా ఈ విషయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి.

ఆనాటి నిర్దిష్ట సామాజిక పరిస్థితుల్లో ఒక అవసరంగా బౌద్ధం ముందుకు వచ్చింది. సమాజంలో ఆనాటికే వేల్లూనుకుని తీవ్రంగా ఉన్న నిచ్చెనమెట్ల అంతరాన్ని బౌద్ధం ప్రశ్నించింది. ఎక్కువ తక్కువలు నశించాలనీ, స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమేఅనీ, చెబుతూ అహింసావాదాన్ని, నిరాడంబర జీవితాన్నీ ప్రచారం చేసింది. ఈ కారణంగా ప్రజానీకం భౌద్ధాన్ని విపరీతంగా అనుసరించడం ప్రారంభించారు. దీనితో, తమ ఆధిపత్యాన్ని కొనసాగించడంకోసం వైదిక ఆర్యులు విశ్వ ప్రయత్నాలు చేశారు. బౌద్ధాన్ని ఆదరించిన రాజ్యాలపై కొందరు రాజులను రెచ్చగొట్టి యుద్ధాలు చేయించారు. ఆదిశంకరాచార్య వంటివారితో మతపరంగా తాత్విక దాడులు చేయించారు. బౌద్ధ భిక్షువులను భౌతికంగా నిర్మూలించడం, భౌద్ధ ఆరామాలను ధ్వంసం చేసి, అక్కడ హిందూ దేవాలయాలు నిర్మించడం వంటి విధ్వంసాలకు పూనుకున్నారు. అయినా బౌద్దమత వ్యాప్తి ఆగలేదు. భారత ఉపఖండం ఎల్లలు దాటి దేశవిదేశాలకు విస్తరించింది. ఇక ఇట్లా కాదనుకున్నారో, ఏమో! ఇప్పుడు బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ ను పోగిడినట్లే, అప్పుడు బుద్ధుడిని కూడా పొగడటం ప్రారంభించారు. ‘ఆహింసో పరమో ధర్మః ‘అంటూ, యజ్ఞయాగాదులలో పశువులను బలి ఇచ్చి, వాటిమాంసాన్ని నిప్పులమీద నేతితో కాల్చుకు తినడం మాత్రం మానేసిన పురోహిత వర్గం”అసలోడికి ఒకటే నామమయితే, కొత్తగా చేరినోడికి ఒంటినిండా నామాలే” అన్నట్లు పూర్తి శాకాహార సాంప్రదాయాన్ని కొత్తగా మొదలుపెట్టి కొనసాగించారు.

బుద్ధుడు చెప్పిన సమానత్వ భావాన్ని పాతాళానికి నెట్టి, తనను మాత్రం ఒక వ్యక్తిగా ఆకాశానికి ఎత్తేశారు. దేవుడిని, దైవభావాన్నీ దూరంగా ఉంచిన బుద్ధుడినే దేవుడిని చేసి, దశావతారాల్లో కలిపే ప్రయత్నం చేశారు. కొన్ని దశాబ్దాల క్రితంవరకూ బుద్ధుడి చిత్రం దశావతారాల్లో కనబడేది. ఆయన భావనలను పాతర వేసి ఆయనను బుద్ధ భగవానుడిని చేశారు. నాస్తికత్వానికి దగ్గరగా ఉండే బుద్ధుడు ప్రవచించిన అసలు బౌద్ధాన్ని హీనయానంగాప్రచారం చేసి ఆచార్య నాగార్జునుని వంటి విద్యా బోధకులద్వారా , వైదిక భౌద్ధాన్ని మహాయానంగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. బౌద్ధంలో అనుసరించిన వ్యుహాన్నే ఇక్కడా అమలు పరిచి, లబ్ది పొందేందుకు హిందూత్వ శక్తులు తయారయాయి. వీటిని సమర్ధవంతంగా తిప్పికోట్టడంలో విఫలమయేట్లయితే, అదే పరిస్తితి పునరావృతం ఆయే ప్రమాదముంది.

నిన్న మొన్నటివరకూ వీరంతా స్వాతంత్రోద్యమంలో బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ పాత్ర గురించి, ఆయన దేశ భక్తిని గురించీ విస్తృతంగా అపోహలు వ్యాపింపజేశారు. వారు ప్రచారం చేసేవాటిలో ముఖ్యాంశాలు :”స్వాతంత్రం కోసం కాంగ్రెస్ నాయకత్వంలో జరిగిన ఉద్యమాల్లో ఆయన పాల్గొనలేదు. క్విట్ ఇండియా తీర్మానాన్ని వ్యతిరేకించాడు. భారత దేశపు వైస్రాయ్ కార్యనిర్వాహక వర్గంలో సభ్యుడుగా చేరేడు. ఇతర అల్ప సంఖ్యాక వర్గాలవారికి ఇస్తున్నట్లుగా దళితులకు ప్రత్యెక నియోజక వర్గాలు కావాలని వాదించి కమ్యూనల్ ఆవార్డు సాధించాడు. (దాన్ని గాంధీజీ నిరాహార దీక్షతో బ్లాక్ మెయిల్ చేసి, తీవ్రమైన ఒత్తిడితెచ్చి బాబా సాహబ్ చే ఉపసంహరింప జేశారు.) నాడు షెడ్యుల్ కులాలకు, అనంతరం బీసీలకూ రిజర్వేషన్లు కల్పించడం ద్వారా దేశ అనైక్యతకు కారణమయాడు. మనుస్మ్రుతిని తగలబెట్టడమే కాకుండా హిందూమతం లోని దురాచారాలను తీవ్రంగా ఖండించాడు. చివరకు హిందూ మతాన్ని వదిలి పెట్టి లక్షమంది దళితులతో సహా బౌద్ధ మతంలోకి మారేడు.” ఇవి విస్తృత ప్రచారం చేస్తూ ఆయనను విమర్శించారు. నాటి కాల పరిస్తితులలో ఆయన చేసిన ఈ చర్యలన్నీ ఎట్లా సరయినవి, గాంధీ నెహ్రుల ఆలోచనలకు భిన్నంగా ఆయన ఆచరణ స్త్రీలు, మైనారిటీలు, దళిత బడుగు వర్గాలకు మేలు చేసేందుకు ఎట్లా బాటలు వేసిందీ చూద్దాం. 

Also read  ఎన్కౌంటర్ లో చనిపోయిన 40 మంది లో ఏడుగురు చిన్నపిల్లలు!

నిచ్చెనమెట్లవంటి సామాజిక స్థారీకరణతోను, దాన్ని ఆశ్రయించి ఉన్న వర్గ పరంపరతోను ఉన్న నాటి సమాజంలో ఆయన ఎదుర్కొన్న సామాజిక వివక్ష, తన ప్రాపంచిక దృక్పధం రూపొందడానికి దోహదపడింది. అట్టడుగున ఉన్న ఆయన సామాజిక స్థాయి వల్ల కలిగిన అనుభవాలు వాస్తవాన్ని అర్ధం చేసుకోడానికి దోహదం చేయగా, ఆయన విస్తృత గ్రంధ పఠనం, ఆయనకుగల అత్యున్నత స్థాయి పరిచయాలు, ఆయనకు మిగతావారికంటే భిన్నమైన దృష్టికోణం ఏర్పడడానికి కారణమయింది.

ఆయన రాజకీయ స్వాతంత్రంకంటే మానవ హక్కులకు, వ్యక్తుల ఆత్మగౌరవానికీ ప్రాముఖ్యతనిచ్చాడు. అందుకే ఆయన కులనిర్మాణ వ్యవస్థకు, కులాల అణచివేతకూ , అమానవీయ అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలనే మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆనాడు ప్రధాన స్రవంతి జాతీయవాద నాయకుల పోరాటం రాజకీయ స్వాతంత్రం కోసం మాత్రమే. ఈ రాజకీయ స్వాతంత్రమనేది సమాజంలో అన్ని ఒనరులనూ అందిపుచ్చుకుని, బాగా అభివృద్ధి చెందిన ప్రజాభాగానికి చెందినవారి ప్రయోజనాలకూ, ఆకాంక్షలకూప్రాతినిధ్యం వహించేదిగా ఉంది.

అప్పటివరకూ అంగ,వంగ, కళింగ, కాశ్మీరాది చప్పన్న దేశాలుగా ఉండిన భారత ఉపఖండంలో కొత్తగా “భారత జాతి” “జాతీయవాదం” అనే భావనలు ఉపిరులూదుకుంటున్న కాలమది. గాంధీ ప్రత్యక్షంగా పాలన, శాసన నిర్మాణ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనలేదు. ఐతే నెహ్రు, బాబాసాహెబ్ డా.అంబేడ్కర్లు కలిసి పని చేశారు. కానీ భారత దేశాన్ని గురించి వీరిద్దరి ద్రుక్ఫదాల్లో చాలా వైవిధ్యం ఉంది. నెహ్రు, తన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ అనే గ్రంధంలో స్పష్టంగా చెప్పినట్లు, “భారత దేశమనేది ఎన్నో విభిన్నతలున్నా, అంతర్గతంగా ఖచ్చితమైన సమన్వయము, ఐక్యతా కలిగి ఉంది. కానీ బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ దృష్టిలో భారతదేశం అనేది “పరస్పర సంఘర్షణలతో, విభజనకు లోనయిన సంస్కృతిక స్థరీకరణతో, ఉంది. అందుకే ఆయన స్వాతంత్ర పోరాటంకంటే ముందుగా సామాజిక సంస్కరణలు ప్రధానమని భావించాడు. ఇదే పరిస్థితులు కొనసాగుతున్న దశలో స్వాతంత్రం ఇచ్చేట్లయితే, అధికారం చేజిక్కించుకునేందుకు పూర్తి అవకాశాలున్న ఆధిపత్య కులాలు, వర్గాలవారు మాత్రమే ఆ ఫలాలు అనుభవిస్తారని ; సామాజికార్ధిక రాజకీయ రంగాల్లో వెనుకబడిన కులాలు/వర్గాల వారిపై నిరంతర దమనకాండతో ఆధిపత్యం నెరపడంజరుగుతుందని ఎంతో ముందుగానే బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ సరిగానే గుర్తించాడు. వారంతా ముందుకు తెచ్చిన గుడ్డి జాతీయవాదం చాలాప్రమాదకరంగా ప్రజావ్యతిరేక రూపం దాలుస్తుందని గుర్తించడం వల్లనే దాన్ని ప్రతిఘటించేందుకు సమానత్వ ప్రాతిపదికన బలమైన పునాది నిర్మించాలని ఆయన తపించాడు. ఈ గుడ్డి జాతీయవాదం ‘దేశభక్తి’ పేరిట దళితులూ, మైనారిటీలపై ఎంతోదమన కాండకు కారణమవటమే కాకుండా, ప్రజల్లో విద్వేషాలు, అనైక్యతలు పెచ్చరిల్లటానికి దారి తీసింది.

బీజేపీ ఏలుబడిలోకి వచ్చిన తరువాత, ఓవైపున అంతర్జాతీయ పెట్టుబడికీ, అంతర్జాతీయ సామ్రాజ్యవాదానికి, దాని ఏజంట్లకూ, ఎర్రతివాచీ పరుస్తూనే, మరోవైపు,జాతీయవాదం పేరుతొ ప్రజలు ఏమి తినాలి? ఏమి తినకూడదు? ఏమి మాట్లాడాలి? ఏమి మాట్లాడకూడదు? ఏవి చూడాలి? ఏవి చూడకూడదు? వంటి అంశాలను కూడా నిర్దేశించడం మొదలు పెట్టేరు. జనగణమన వివాదం, గోమాంస భక్షణ నిషేధం, తదితరాలు ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. తీవ్ర ప్రజాప్రతిఘటనతో వాటిని వెనక్కు తీసుకున్నా, ఇప్పుడు అదే తీవ్ర జాతీయవాద శక్తులు లెనిన్, పెరియార్, అంబేడ్కర్ల విగ్రహాలను పగలగొట్టడంవంటి దుశ్చర్యలకు పాల్బడటం మన కళ్ళముందు కనబడుతోంది.

నేటికీ అనేకమంది విద్యావంతులు సైతం ‘రాజకీయ రిజర్వేషన్లు’ బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ భిక్షగా భావిస్తున్నారు. రాజకీయ పదవులలో రిజర్వేషన్లు వస్తే ఇపుడున్న విధంగా డబ్బుకూ, పెత్తందారీ ఆధిపత్యాలకూ బలికావడం తప్ప ఒరిగేదేమీ లేదని ఆయన ముందుగానే అంచనా వేశాడు.

అందుకే ఆయన దళితులకు ప్రత్యెక నియోజక వర్గాలు కావాలన్నాడు. భారత దేశంలో నూతన రాజ్యాంగ సంస్కరణలకోసం, భారత దేశంలో పర్యటించిన సైమన్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చించేందుకు గానూ బ్రిటీష్ ప్రభుత్వం 1930;1931;1932 సంవత్సరాల్లో మూడుసార్లు రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించింది. ఈ సమావేశాలలో బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ దళితులకు ప్రత్యెక నియోజక వర్గాల అవసరాన్ని గుర్తించి తన అసమాన మేధా సంపత్తి, వాదనాపటిమతో,మెప్పించాడు.

1931లో జరిగిన రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా గాంధీ హాజరయ్యెడు. దళితులకు ప్రత్యెక నియోజక వర్గాలఏర్పాటును వ్యతిరేకించిన గాంధీ ఈ సమావేశంలోనుంచీ వెళ్ళిపోయాడు. బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ చెప్పిన ప్రకారం, దళితులకు ప్రత్యెక నియోజకవర్గాలను కేటాయిస్తూ, మెక్ డోనాల్డ్ కమ్యూనల్ ఆవార్డును ప్రకటించారు.

ఆ సమయానికి శాసనోల్లంఘన నేరంపై గాంధీజీ ఎరవాడ జైలులో ఉన్నాడు. ప్రత్యెక నియోజక వర్గాలవల్ల హిందూ సమాజం చీలిపోతుందని భావించిన గాంధీజీ ఈ ఆవార్డును నిరసిస్తూ జైలులోనే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా మారటంతో, కాంగ్రెస్ నాయకులతో సహా ఆనాటి ప్రధాన స్రవంతి రాజకీయ వేత్తలంతా , గాంధీజీ మరణానికి బాధ్యత వహించాల్సి వస్తుందని బాబా సాహెబ్ పై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా గత్యంతరం లేని పరిస్థితుల్లో బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ అందుకు తలొగ్గటంతో, పూనా ఒప్పందం జరిగింది. ఆప్రకారం దళితులకు ప్రత్యెక నియోజక వర్గాలకు బదులు ఉమ్మడి నియోజకవర్గాల్లో రిజర్వేషన్లు కల్పించారు. దీని ఫలితంగానే రాజకీయ అధికారం దళితులకు పూర్తిగా దూరమైంది. నోట్లు చల్లి ఓట్లు పండించుకునే వర్తమాన ఎన్నికల వ్యవస్థలో , ప్రత్యేక నియోజక వర్గాలు లేని కారణంగా , రిజర్వుడు స్థానాలలో ఆధిపత్య వర్గాలకు నమ్మిన బంటులకు మాత్రమె పోటీకి అవకాశం లభిస్తోంది. మద్యం,డబ్బు పంచి, లేకపోతె దమనకాండ ద్వారా రక్తం పారించి ఓట్లు వేయిచుకున్తున్నారు. ఫలితంగా వారు ఓటు వేయడానికే తప్ప ఓటు తీసుకునే అధికారాన్ని శాస్వితంగా కోల్పోయారు. 

Also read  నాయకుడు లేని ఎస్సి సామాజిక వర్గం!

అనంతర కాలంలో దేశానికి రాజ్యాంగం రాసే పనిని ఆయనకు అప్పజేప్పినపుడు, ఆయన ప్రాధాన్యతగల అంశాలుగా భావించిన,; స్త్రీలు, షెడ్యుల్డ్ కులాలు, జాతులు, మైనార్టీల పరిరక్షణ, అస్పృశ్యతా నిర్ములనలతోబాటుగా, ఒక బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పరచడం తన లక్ష్యంగా పెట్టుకున్నాడు.

ఆయన ఇట్లా భావించడానికి ఆనాడు నెలకొని ఉన్న ప్రత్యేక పరిస్థితులే కారణం. ఆనాటికి బ్రిటీషు ఇండియా ప్రత్యక్ష పాలనలో ఉన్న ప్రదేశాలే కాకుండా, భారత ఉపఖండంకొద్దీ గొప్పా సార్వభౌమాధికారాలతో; అనేక స్వతంత్ర రాజ్యాలుగా విడివడి ఉంది. నాటి రాజ్యంగ సభలో స్వదేశీ సంస్థానాధీశుల ప్రతినిధులుగా ఏకంగా 70 మంది ఉన్నారు. వీరంతా స్వంత రాజ్యాంగం, సొంత సైన్యాల ప్రతిపాదనలతో వచ్చారు. ఎంతో ఆశ్చర్యకరమైన విషయమేమంటే, రాజ్యాంగం ముసాయిదా తయారుచేసే ఉప సంఘాలు వీటన్నిటికీ అనుకూలంగా ప్రతిపాదనలను తయారు చేయడం. దీన్ని చూసిన బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ ఎంతో కలవరపాటుకూ, ఆగ్రహానికీ గురయాడు. వీటన్నిటికీ ఒకే నిబంధనలు ఉండేట్లుగా కృషి చేశాడు. అయితే అధికారాలు ఒకే చోట కేంద్రీక్రుతమైతే వచ్చే ప్రమాదాలను కూడా ఆయన ముందుగానే ఉహించాడు.

అందుకేబలమైన కేంద్ర ప్రభుత్వంతోబాటుగా, బలమైన రాష్ట్రాలతో కూడిన సమాఖ్య ఉండాలని ఆశించాడు. అందుకే రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎయే అంశాలపై అధికారాలుండాలో విస్పష్టంగా పేర్కొని, వాటిని “కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి, అధికారాలు” అనే భాగాల జాబితా రూపొందించి, ఇంకా ఈ జాబితాలో పేర్కొనకుండా మిగిలిపోయిన అవసిష్టాధికారాలపై కేంద్రానికి అధికారం ఉండేలా రూపొందించడం జరిగింది.

నాటి ప్రత్యెక పరిస్థితులలో ఆయన కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఇచ్చేందుకు అనుకూలుడుగా ఉన్నాడుకానీ,వాస్తవంలో అధికార వికేంద్రీకరణకు ఆయన వ్యతిరేకం కాదు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం; అత్యవసర పరిస్థితికి సంబంధించి రాజ్యాంగంలో ఉన్న 352, 356, 360 ప్రకరణాల గురించి. వీటిలో 356వ ప్రకరణం ప్రకారం కేంద్రం తన ఇష్టానుసారం, రాజకీయ ప్రయోజనాలకోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయిన రాష్ట్రాలలోని ప్రభుత్వాలను రద్దు చేయడానికి సంబంధించింది. ఇవన్నీ బాబా సాహెబ్ కొత్తగా పెట్టినవి కాదు. అనేక అంశాలతోబాటు ఈ అత్యవసర పరిస్తితికి సబంధించిన అంశాలను కూడా 1935 భారత చట్టం నుంచీ యధాతధంగా పొందుపరిచారు కాబట్టి వీటికి బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ ను బాధ్యుడిని చేయలేము. ప్రస్తుతం ఉత్తర భారత ఆధిపత్యానికి వ్యతిరేకంగా దక్షినాది రాష్ట్రాల్లో వ్యతిరేకత పెచ్చరిల్లుతోంది. అనేక చోట్ల ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యం పెరుగుతోంది. ఎపీకి ప్రత్యేక హోదా అంశం కానీ, రిజర్వేషన్ లను పెంచుకునే అధికారం తో సహా రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు కావాలని ,మూడో ఫ్రంటు ఆలోచనతో తెలంగాణా ముఖ్యమంత్రి నేతృత్వంలో జరుగుతున్న ఉద్యమంకానీ,.. ఇటువంటివన్నీ ప్రజల వికేంద్రీకరణ ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించేవిగానే చెప్పుకోవచ్చు. స్వేచ్చ, స్వాతంత్రయం , సౌబ్రాతృత్వాల్ని ఆరాధించేవానిగా ఆయన నేడు ఉన్నట్లయితే,నిజమైన సమాఖ్యకు తప్పనిసరిగా మద్దతు ఇచ్చి ఉండేవాడు.

సాంఘిక, ఆర్ధిక సమానత్వం లేనిదే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు కాదనని,ఆయన పదేపదే స్పష్టపరిచేడు. అందుకై ఆయన అలుపెరుగని పోరాటం చేశాడు. కాంగ్రెస్ పార్టీ లోని ప్రధాన స్రవంతి రాజకీయ నాయకులు మొత్తం రాజకీయ స్వాతంత్రం మాత్రమే ముఖ్యంగా భావించి, చాలా తెలివిగా ఆయన మేదోసామర్ధ్యాలను, అశేష జనసందోహంలో ఆయనకున్న పలుకుబడినీ తమకు అనుకూలంగా వాడుకున్నారు. దీని ఫలితంగా, ఆనాటికే ఎదిగి ఉన్న టాటా, బిర్లా, గోయెంకా వంటి పెట్టుబడిదారులకూ, సంస్థానాధీశులు, జమీందార్లు, అగ్రకుల భుస్వాములకే స్వాతంత్ర ఫలాలు అందేయి. అప్పటివరకూ స్వాతంత్ర ఉద్యమాన్ని వ్యతిరేకించినవారితో సహా అంతా ఖద్దరు టోపీలు ధరించి, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగాఅధికార పగ్గాలు చేపట్టి తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. ఇదంతా కొత్త సీసాలో పాత సారాలా తయారయింది. దీనివల్ల స్వాతంత్రం బడుగుల బతుకుల్లో ఏకొద్దిమార్పు కూడా తేలేకపోయింది. ఈ వంచన కార్యక్రమంలో గాంధీజీ చాలా ప్రముఖ పాత్ర పోషించాడు.

ఆమరణ నిరాహార దీక్షకు కుర్చుని,కమ్యూనల్ ఆవార్డు రద్దు చేయించాడు. అంటరానితనం తొలగించాలని 1922లో బార్డోలీ తీర్మానం చేయించడం తప్ప ఆచరణలో చేసింది ఏమీలేదు. అయిందానికీ కానిదానికీ చీటికీమాటికీ అలకలూ సత్యాగ్రహాలూ మొదలుపెట్టే అలవాటున్న గాంధీజీ ఒక్కసారికూడా హరిజనులకోసం సత్యాగ్రహం చేయలేదు. హరిజన సేవా సంఘ నాయకత్వంలో హరిజనులకు చోటు లేకుండా చేశాడు. కుల అంతరాలను, వివక్షనూ సమర్ధించే భగవద్గీతను చంకలో పెట్టుకు తిరుగుతూ, ‘రఘుపతి రాఘవ రాజారాం’ పాటపాడుతూ తిరిగేవాడు. అందుకే బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ గాంధీజీ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని పదేపదే హెచ్చరించేవాడు. కాంగ్రెసు పార్టీ బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ను స్వంతంచేసుకుని, నేటికీ ఈ వంచనా శిల్పాన్ని దశాబ్దాలుగా కొనసాగిస్తోంది.

మహిళా హక్కులు, స్వేచ్ఛకోసం ఆయన నిరంతరం తపించేవాడు. “మహిళల పురోగతి స్తాయి సమాజ పురోగతి స్టాయికి కొలబద్ద” అన్నాడు. స్త్రీలు, దళితులను మనుస్మృతి అతి హీనంగా చూసిందనీ, వీరి అణచివేతకు అదే కారణమనీ ఆయన బలంగా విశ్వసించాడు. ఆయన న్యాయ శాఖ మంత్రిగా ఈనాటికీ ఎంతో అభ్యుదయ భావాలతో కనబడే హిందూ కోడ్ బిల్లును 1951 పిబ్రవరి 5వ తేదీన నాటి శాసన సభలో ప్రవేశపెట్టేడు. స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు; యజమాని మరణించినపుడు దత్త పుత్రునితోబాటు దత్త తల్లికీ ఆస్తి హక్కు; కులాంతర మతాంతర వివాహాలను ఆమోదించడం, వివాహాలను రిజిస్ట్రేషన్ పద్ధతిలో జరిపించడం, బహుభార్యాత్వాన్ని రద్దు చేయడం; ఏకులంనుంచీ అయినా దత్తత తీసుకునే హక్కు; విడాకులకు అంగీకరించడం; కుటుంబ సభ్యులందరితోబాటు స్త్రీలకూ ఆస్తి హక్కు; వివిధ ప్రాంతాలలో వివిధ రూపాలలో, అనేక పేర్లతో, అనేక విధాలుగా ఉన్న దాయ భాగ, మితాక్షరి వంటి భిన్న విలువలు, పద్ధతులూ ఉన్న హిందూ మతంలోని స్థానిక చట్టాలను ఏకం చేసి, ఒకే పౌరస్మ్రుతిని ఏర్పాటు చేయడం; వంటి అనేక గొప్ప ప్రతిపాదనలు అందులో ఉన్నాయి.

Also read  స్టేట్ సోషలిజం - బారత ఆర్ధిక, సామజిక, రాజకీయ ప్రజాస్వామ్యం: డా.అంబేడ్కర్ ప్రతిపాదనలు!

ఆధిపత్య వర్గాలు, పురుషస్వామ్య భావజాలం గలవారితో నిండిఉన్న ఆ సభలో కొద్దిమంది స్త్రీలు, అభ్యుదయవాదులు తప్ప అంతా ఆ బిల్లును వ్యతిరేకించారు.ఆ బిల్లును ఆయన ఎంత ప్రతిభావంతంగా వాదించి నా, రాజేంద్రప్రసాద్, పటేల్ వంటివారితో సహా ఆ బిల్లును రాకుండా అడ్డుపడ్డారు. హేతువాదిగా, సోషలిస్టు భావాలున్నవానిగా భుజకీర్తులు తగిలించుకున్న నెహ్రు సైతం, రాజకీయ ప్రయోజనాలకోసం బిల్లు మొత్తాన్నీ ఏకపక్షంగా తిరస్కరించడానికి పూనుకోవడంతో ఆ బిల్లు వీగిపోయింది. దీంతో తీవ్ర నిరాశకు ఆగ్రహావేశాలకు గురి అయిన బాబాసాహెబ్ తృణప్రాయంగా తన కేంద్ర న్యాయశాఖా మంత్రి పదవికి రాజీనామా చేశాడు. కాలగమనం మార్పులకు లోనవక తప్పదు. నాడు ఆయన ప్రవేశ పెట్టగా తిరస్కారానికి గురిఅయిన అంశాలన్నీ చట్టరూపంలో నేడు ప్రజలు అనుభవిస్తున్నారు. వీటికి మార్గదర్శిగా క్రాంత దర్శిగా బాబాసాహేబ్ ను నేటితరం మననం చేసుకోవాల్సి ఉంటుంది. 

పదవికి రాజీనామా చేసిన అనతరం ఆయన తన పూర్తి జీవితాన్ని బడుగు కులాల సంక్షేమానికి కృషి చేసాడు. పూజారి వర్గం, దేవుడు, మహత్యాల పేరిట ఉన్న క్రైస్తవ మతాన్ని కూడా ఆయన రెండోమాట లేకుండా పూర్తిగా తిరస్కరించాడు. కానీ నేడు హిందూమతాన్ని ఆచరిస్తూ, తాము బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ వాదులమని చెప్పుకునే విధంగాగానీ, బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ భావాలకు విరుద్ధంగా గణనీయమైన సంఖ్యలో క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూ, అంబేద్కరిస్టులమని చెప్పుకునే చిత్తశుద్ధి లేనివారు కూడా నానాటికీ పెరిగిపోతున్నారు.

ఆయన బుద్ధుడిని “మనువాదాన్ని ప్రశ్నించే బ్రాంహణీయ తాత్విక ధోరణిని ప్రవేశపెట్టిన తాత్విక విప్లవకారునిగా” గుర్తించాడు. భారత ఉప ఖండాన్ని ఆయన బుద్ధుని దేశంగా భావించాడు.

ఆయన మార్క్సిజాన్ని కూడా అధ్యయనం చేశాడు. ప్రపంచాన్ని మార్చడమే తత్వశాస్త్రం చేయాల్సిన పని అన్న మార్క్స్ మాటలను ఆయన సమర్ధించాడు. ప్రపంచంలో వర్గాలమధ్య ఘర్షణ ఉన్నదనీ, వ్యక్తిగత ఆస్తివలన దోపిడీ పీడనా పుడుతున్నాయనీ ఆయన విశ్వసించాడు.ఈ లక్ష్యాల సాధనకు కారల్ మార్క్స్ హింసనూ,కార్మిక నియంత్రుత్వాన్నీ సూచించగా, బుద్ధుడు అహింసను, మానసిక పరివర్తననూ సూచించాడని ఆయన పేర్కొన్నాడు.

‘బుద్ధా అండ్ కార్ల్ మార్క్స్’ అనే పుస్తకంలో మార్క్స్ తరహా సోషలిజం కంటే, బుద్ధుడు చెప్పిన అహింసాయుత సమానత్వం గొప్పదని పేర్కొన్నాడు. ఆయన లక్షలాదిమంది అననుయులతో బౌద్ధమతాన్ని స్వీకరించాడు. ఆనాడు ఆయనతోబాటు బౌద్ధాన్ని స్వీకరించినవారంతా తమ కులపరమైన గుర్తింపును వదిలిపెట్టి, ‘నియో బుద్ధిస్టులు’గా గుర్తింపు తెచ్చుకొని అదేవిధంగా కొనసాగుతున్నారు. 

ఆనాడు అనేక బడుగు కులాలకు చెందినవారికి ఆహారంగా ఉన్న ఆవును తినకూడదని వినోబా బావే ఆందోళనలు నిర్వహించి కొన్ని శాసనాలు కూడా చేయించాడు. ఇందిరాగాంధీతో సహా నాటి కాంగ్రేసు వాళ్ళంతా వినోబాబావే ఆసీస్సులకు వేలుతున్దేవారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం దీన్ని మరింత ముందుకు తీసుకుపోయింది. కొన్నిరాష్ట్రాల్లో నిషేధ చట్టం తెచ్చారు. దేశవ్యాపితంగా చట్టాన్ని తెచ్చే ప్రయత్నం చేయగా కేరళతో సహా అనేక దక్షినాది ప్రాంతాల తీవ్ర ఆగ్రహాన్ని చవిచూడటంతో ఆ బిల్లును వెనక్కి తీసుకున్నారు. ఆవుకు, ఆవు విసర్జితాలకు (పంచకము, పేడ) లకు విపరీతంగా మహాత్యాలను అంటగట్టడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయమేమంటే, తెల్లగా ఉండే ఆవుకు మాత్రమే మహత్యాలు ఆపాదించి, నల్లగా ఉండే బర్రెలను తక్కువ చేసి చూడటంలో మనుషులలోని రంగు బేధాల కారణంగా మనుషులలో తేడాలను, ఎక్కున తక్కువలనూ న్యాయబద్ధం చేసే కుట్రగా కూడా దీన్ని అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. 

నేడు బీజీపీ వారంతా కొత్తగా గాంధీజీతోబాటు బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ను కూడా ఒక ఎన్నికల ఎత్తుగడగా గుత్తకు తీసుకున్నారు. బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ ఎప్పుడూ హిందువులను , అగ్రవర్నాలను, బ్రామ్హణవాదులనూ ఏనాడు విద్వేషంతో తిట్టలేదు. లోతుగా విశ్లేషించాడు. మనుధర్మ శాస్త్రాల్లోని అమానుషాన్నీ, ప్రాజావ్యతిరేక ఆధిపత్య ధోరణులనూ ఎండగట్టేడు. బుద్ధునికి పూర్వం హిందూ పుజారివర్గం యజ్ఞ యాగాదుల పేరిట ఆవులను చంపి, ఆవుమాంసాన్ని తిన్న దృష్టాంతాలు చూపేడు. పూర్తి ఆధిపత్య రాజకీయాలు నడిపే వీళ్ళ ఎత్తులకు పీడిత ప్రజానీకం పడిపోతారనేది వారి భ్రమ మాత్రమె. రాజకీయ అధికారంలో జనాభా దామాషా ప్రకారం నిజమైన భాగస్వామ్యమే సమస్యా పరిష్కార మార్గంగా బాబా సాహెబ్ చెప్పిన మాటలు ఫలవంతం చేయడానికి అంతా నడుం కట్టాలి.

రాజకీయంగా ఒక మనిషికి ఒకే ఓటు, ఒక ఓటుకి ఒకే విలువ ఉంటాయి. కానీ మన ఆర్థిక రాజకీయ వ్యవస్థ మూలంగా మన సామాజిక, ఆర్థిక జీవనంలో మనం ఒక మనిషికి ఒకే విలువ అన్న సూత్రాన్ని నిరాకరిస్తూనే ఉంటాం. ఈ వైరుధ్యాన్ని వీలైనంత త్వరగా తొలగించి తీరాలి. లేకపోతే, ఎంతో శ్రమించి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామ్య సౌధాన్ని అసమానతలు అనుభవిస్తున్నవారు ధ్వంసం (బ్లోఅప్‌) చేస్తారు’. 1949 నవంబర్‌న బాబాసాహెబ్ డా.అంబేడ్కర్‌అన్న మాటలివి.

అనిసెట్టి శాయి కుమార్

(Visited 236 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!