మదర్స్ డే:దళిత మాతృమూర్తులు

షేర్ చెయ్యండి

ప్రపంచ మాతృ మూర్తుల దినోత్సవం సందర్బంగా మాతృ మూర్తుల సేవలను ఘనంగా గుర్తుచేసుకున్నారు. ‘మదర్స్ డే ‘ పేరిట జరిగిన ఈ కార్యక్రమాన్ని కొందరు వ్యతిరేకించడం తెలిసిందే. అమ్మలకు ఒక రోజంటూ లేదని కొందరి వాదన.


మదర్స్ డే జరుపుకోవడం 20వ శతాబ్దం లో అమెరికా వాసి అన్న జర్విస్ అనే మహిళ 1908 లో ప్రారంభించింది. అన్నజర్విస్ అమ్మ గారు మదర్స్ డే లాంటి ఒక రోజు అమ్మ లకు ఉండాలని ఎప్పుడూ కోరుకునేది. 


అన్నజర్విస్ తల్లి చనిపోయిన తర్వాత, ఆమె కోరిక తీర్చడం కోసం జెర్విస్ ఈ ఉద్యమం చేపట్టి ఒకరోజు మాతృ మూర్తులకు సెలవు కావాలని పోరాటం చేసింది. అయితే ఈ మదర్స్ డే వ్యాపారాత్మకం అవ్వడం అన్నజెర్విస్ కూడా వెతిరేకిస్తుంది. 


మదర్స్ డే తప్పు లేదా రైట్ అనే చర్చ పక్కన పెట్టి ఈ సందర్బంగా దళిత మాతృమూర్తుల జీవన చిత్రాన్ని, ఆ తల్లులు పడిన కష్టాన్ని, గుర్తు చేసుకుందాం.


అందరి అమ్మలకు దళిత వాడల్లో ఉన్న అమ్మ కు చాలా తేడా ఉంది. శ్రమనే పెట్టుబడిగా తమ కొడుకులను, కూతురులను చదివించడానికి , ప్రయోజకులు చెయ్యడానికి ఎన్ని అవమానాలు తమ గుండెల్లో దాచుకున్నారో ఆ మాతృ మూర్తులకే తెలుసు. 


ప్రముఖ కవి మద్దూరి నగేష్ బాబు అమ్మని చూద్దామని అంటూ  వెలివాడ అమ్మ గురించి ఈ విధంగా వర్ణించాడు.

 
చాలాకాలం తర్వత అమ్మని చూద్దామని బయలుదేరా,
బస్సు దిగేసరికి బాగా పొద్దుపోయింది. 
శీతాకాలపు జిగట వెన్నెల పూరి గుడిసెల పై కప్పిన కఫన్ లా ఉంది. 
తెల్లటి ముసుగులో – పల్లె ముండమోపి ముసిల్దానిలా ఉంది. 
చట్టాలకు అర్ధంకాని సాక్ష్యాలు కాబోలు కీచురాళ్ళ ఎలుగెత్తి పాడుతున్నాయి. 
మంచు మెలి ముసుగులో ఇష్టంలేని పెళ్లికూతుర్లా ఉన్నపల్లె సమాధుల దొడ్డి డీబీసులో కూరుకుపోయి ఉంది. 
దూరంగా ఎక్కడ్నుంచో ఒక కుక్క హృదయ విదారకంగా ఏడుస్తూ
నడుస్తుంటే – నా నేల బురదచేతుల్తో నన్ను చుట్టేసింది. 
వాన గుంటల్లోంచి కప్పలు లయబద్దంగా నినదిస్తూ 
కాలికేదో తగిలింది – చూస్తే ఎముక !!హమ్మయ్య! గొడ్డుది. 
ఈ గుడిశెలో నేను సంచి తగిలించుకు బడికి బైలుదేరినప్పుడల్లా ‘వొరే కలకటేరూ ‘ అని ఏడిపించిన ‘సామేలు’ తాత ఉండాలి. పేపర్లో మృతుల లిస్టులో మొదటి పేరు – సామేలే!
నా నెత్తుర్నేవరో బొక్కెనలేసి తోడుకుంటున్నారు. ఒళ్ళంతా శక్తి హీనమై కుప్పకూలిపోతూ ఉంది. 
మా గుడిశె తడికె నెట్టాలని చెయ్యిచాస్తే ఎందుకోగానీ వొణుకు!
లోపల కుక్కిమంచంలోంచి ఎడతెరిపిలేని క్షయ దగ్గు కళ్ళే నిండిన గొంతుతో – అమ్మ 
ఎవరూ … ? 

Also read  How a group of six Dalit women in Andhra empowered with journalism


మద్దూరి నగేష్ బాబు అద్భుతంగా ఆవిష్కరించిన వెలివాడ – అమ్మ. దళిత మాతృమూర్తి.  పొద్దెనక, వాన, ఎండనక  పొలం గట్ల మీద నాలుగు  పచ్చడి మెతుకులు తినో తినక, పొగాకు గ్రేడింగుల్లో చేదు విషాన్ని కలుపుకుని తిని తన బిడ్డల ఎదుగుదల కోసం శ్రమించిన అమ్మ ల గురించి  మదర్స్ డే రోజైనా గుర్తు చేసుకోవడం సంతోషకరం. 

“భూగోళానికి వున్న ఒకే ఒక్క జీవ లక్షణం అమ్మల్ని కనడం

కదుల్తూ కూడా కదలనట్టుండే జీవనది పేరు అమ్మ.

1963 వ సంవత్సరం నవంబర్ 3 వ తేదీన
పైడి సుబ్బులు అమ్మ అయింది”

మరో కవి పైడి తెరేష్ బాబు మరో అద్భుత వర్ణణ కదుల్తూ కూడా కదలినట్టుండే జీవనది పేరు అమ్మ. ఇంతకంటే గొప్ప గా అమ్మ గురించి ఆవిష్కరణ చెయ్యగలం. 

 
సాధారణ అమ్మ లకు అంటే దళిత వాడల్లో పుట్టిన అమ్మలకు చాలా తేడా ఉంది. మిగతా వర్గాల్లో అమ్మ పడే కష్టం వంటింటిలోనే దళిత తల్లి వంటింటిలో పని చెయ్యాలి, బయట పని చెయ్యాలి. 


మట్టిబలపం అనే కవితా ససంపుటి లో పైడి తెరేష్ బాబు తన తల్లి పడిన కష్టాన్ని కవిత ద్వారా చెప్పిన తీరు దళిత మాతృమూర్తుల నిజ జీవితానికి సాక్ష్యం. 

జాము పొద్దు కాడనే లేచి
జానెడు ఆకల్ని గుప్పిట్లో పెట్టుకుని
చెప్పుల్లేని కాళ్ళు రెండు వరి నాట్ల కోసం పరుగెత్తినట్లు జ్ఞాపకం
బొట్టు బొట్టుగా పొదుపు చేసుకున్న రక్తాన్ని
టుబాకో కంపెనీ పొగాకు బేళ్ళ మీద చిలకరించిన జ్ఞాపకం
ఆరుగాలం అరవచాకిరీకి
బోనసుగా అందిన కుచ్చి నరాల పోట్లకి
ఉతుకుతున్న చీరెని మెలేసి పిండినట్లు
శరీరం లోంచి బాధను పిండుకుంటూ విల విల్లాడిన జ్ఞాపకం
పుగాక్కాడ ఈనెను చీల్చినట్లు
దారిద్ర్యం అమ్మను రెండు చీకటి తుంపులుగా చీల్చిన జ్ఞాపకం

 

చీకటి పడ్డాక ఇంటి దారి పట్టిన గ్రేడింగ్ కార్మికుల బిడారులో
అమ్మ ముఖాన్ని గుర్తు పట్టడం నాకు రోజువారీ పరీక్ష
దూరంగా కన్పించే అమ్మను నా నవ్వుతోనే కావిలించుకోవడం కోసం
రోడ్డువార లైబ్రరీ బేస్ మట్టం మీద నా రెండు కళ్ళూ కాయలై రాలిన జ్ఞాపకం
అమ్మ తెచ్చే తాయిలాలు నాకెందుకు
సాయంకాలానికి భద్రంగా ఇల్లు చేరే అమ్మే ఒక అద్భుతమైన తాయిలం

Also read  స్వేచ్చ, సౌభ్రాతత్వం ఎస్సి మహిళల ఆభరణం!

అమ్మను రెక్కల కష్టం మింగేసింది
పొగాకు పరిశ్రమ అమ్మను సిగరెట్టూ చేసి కాల్చుకుంది
ఒంగోలు కట్టుకున్న బాధల గది పేరు అమ్మ
సుబ్బులమ్మ ధీమా అంతా తన కొడుకు అచ్చరాలు దిద్దుతున్నాడనే

నా బాల్యమ్మీద అల్లుకున్న రాత్రుల్లన్నీ ఆంప శయ్యలె
సారా సీసాలు నాన్నల్ని తాగేక
నాన్నలు అమ్మల్ని కాల్చుకు తింటుంటారు
అమ్మలు ఎదురుచూపుల్ని నములుతూ చాప మీద మూడంకెలేసాక
కూటి కుండలు కుక్కల పాలైన జ్ఞాపకం

చిల్ల కంపలు ఎండుమోపులయ్యేది అమ్మల కోసం
దిగడానికి చోటు దొరకదేమని
ఒంటి మీద తుమ్మ ముళ్ళు ఎన్నో సార్లు అలిగిన జ్ఞాపకం
ఆసామి గారి చేను పరిగలయ్యేది అమ్మల కోసం
ఏరుకున్న వేరు శనగల్తో గాక ఆసామి నాలుక
చరుపులతో పైట చెంగు మూటలు బరువెక్కినట్టు జ్ఞాపకం

నా ఒంట్లో వున్న ప్రతి జీవకణం
అమ్మ నుండి కోసుకొచ్చుకున్నదే
నేననే వాడిని ప్రత్యేకించి ఎట్లా ఉంటానో నాకిప్పటికీ అంతు పట్టదు
అమ్మను చూడాలనుకున్నపుడల్లా
నన్ను నేను అద్దంలో చూసుకుంటాను
అద్దంలో కనబడని గుండెకాయ మాత్రం
ఒంగోలు గుమ్మంలో కొడుకు ఉత్తరం కోసం ఎదురు చూస్తూ వుంటుంది
నేను అక్షరాన్నైతే అమ్మ మట్టి బలపం!

ఇదంతా ఊహ కాదు. ‘అమ్మలగన్న అమ్మ మా అమ్మ’ అంటూ ఊహించి రాసింది కాదు. గ్రామాల్లో , పట్టణాల్లో దళిత మాతృ మూర్తుల జీవిన చిత్రం.  

మదర్స్ డే  అంటూ పైడి సుబ్బమ్మ లాంటి ఎందరో మహా మాతృ మూర్తులను తలుచుకోవడం గౌరవించుకోవడం ఆనందమే కదా!


దళిత కుటుంబాల్లో అమ్మ ల పాత్ర విష్ఠిమైనది. ఎక్కువ శ్రమ అమ్మ లదే. అమ్మ  కూలి డబ్బులు  లాగేసుకుని పూటుగా తాగి లకారం తో తిడుతూ అమ్మనే తిట్టే ఎందరో బాధ్యతలేని నాన్నలు ఉన్న సమాజం ఎస్సి లది. 

ఏడు వారా నగల లాంటి మమ్మల్ని కని కూడా అమ్మ నిరలంకారంగానే ఉండి పోయింది.

 
కవి సి హెచ్ రాం  ‘కొయిటా అమ్మకు కన్నీటి ఉత్తరం’ అంటూ రాసిన కవితా సంకలనం లో వెలివాడ అమ్మ లే కాదు తన కుటంబం ఆర్ధికంగా, సామాజికంగా ఎదగటానికి కుటుంబాలను వదిలేసి కువైట్ వెళ్లిన అమ్మ ల త్యాగం గురించి రాసాడు.

Also read  మహిళా అబ్యుదయవాది బాబాసాహెబ్ డా. అంబేడ్కర్!


అరేబియా సముద్రం ఆవల ఖర్జురపు చెట్టుకికన్నీటిని ఒంపుతున్న అమ్మా!బాల్యమంతా నీ గుండెల మీద పడుకుని విన్న అరేబియన్ నైట్స్ కధలు ఇప్పుడు జ్ఞాపకం వస్తే ఏ ఆర్ధిక మాంత్రికుడో నిన్ను అరబ్బు దేశానికి ఎత్తుకు పోయినట్లుంటుంది. 


సాయంత్రమైతే చాలు కోడిపిల్లల్ని కోళ్ల గూటి కిందికి తోలి గెద్దెత్తుకు పోయిన కోడి పిల్ల కోసం దిగుల పడ్డ అమ్మా!గెద్ద గుర్తు దేశంలో ఎలా ఉన్నావే!


నాన్న కట్టిన తాళిని నల్లని బుర్కాకింద దాచేసిఎడారి ఒంటె కడుపులోనే నీళ్ల సంచిని మోస్తున్నట్లు నువ్వు కళ్ళ క్రింద కన్నీటి సంచుల్ని మోస్తున్నావా?


పిల్లల ఆకలి కొలతలు కొలిచిఆకాశంలో విమానాన్ని, చందమామని చూపించిగోరుముద్దలు తినిపించిన అమ్మా రాత్రయితే చాలు నిద్రలో నిన్నే కలవరిస్తున్న చెల్లిని గుండెలపై పడుకోబెట్టుకుని నాన్న దిగులు దిండవుతున్నాడు.

ఆకలేసి నీ పాల బాయిని మునిపంటితో నొక్కి పట్టి మరో బాయి ని చేతితో తడుముతున్నప్పుడు తన్మయత్నమైన అమ్మా నీవు చేసే ఆయా పనిలో అమ్మా! అని పిలిచే పసిపిల్లల మాటల కింద మనసుని ఎలా నొక్కి పడుతున్నావే.

నువ్వు జ్ఞాపకమొచ్చి చిట్టి తమ్ముడు నువ్వు చివరిగా పెట్టుకున్న ఐటెక్సు తిలకం సీసాలో మిగిలిన తిలకాన్ని మూతి చుట్టూ రాసుకుని బాల హనుమాన్ లా సముద్రం దాటి నిన్ను తీసుకు వస్తున్నప్పుడు ఇల్లంతా ఒక్కటే దుఃఖం అమ్మా తడారిపోయిన కళ్ళతో మేము తడిలేని ఎడారిలో నీవు తొందరగా వచ్చేయవే. 


దళిత సమాజంలో పుట్టిన అమ్మలకు మదర్స్ డే లేవు. వారికి తెలిసిందల్లా తనలాగే కొడుకు, కూతురు ఊళ్ళో నిక్కరు తొడుక్కోవడం కూడా రాని వాడి తో సహా అవమానాలు పొందకూడదని.


నేడు ఎందరో దళితులు ప్రయోజకులు అయ్యేరు అంటే అది ఆ మహా తల్లుల వలెనే   ఆ  త్యాగ మూర్తులకు మదర్స్ డే శుభాకాంక్షలు.  

(Visited 54 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!