వలస కూలీలు:వలస కార్మికుల నెత్తుటి నడక!

0
451
వలస కూలీలు

వలస కూలీలు ఎక్కువ ట్రెండ్ ఉన్న పదం. అయినా చర్చినీయాంశం కాలేదు. మీడియా కంటితుడుపు నాలుగు సానుభూతి మాటలు మాట్లాడింది. ప్రభుత్వాలు అడపాదడపా స్పందించే ప్రయత్నం చేస్తున్నాయి.


కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిస్తున్నా పాలకులు వ్యక్తిగత ప్రచారంలో మునిగి నమస్తే ట్రంప్ అంటూ గ్రహాంతర వాసి భూమి మీదకు అడుగుపెట్టినంత ప్రచార యావలో మునిగిపోయారు.


దేవతా వస్త్రాలు కట్టుకున్న రాజు కు తెలివి వచ్చినట్లు మన పాలకులకు ఒక్కసారి గా కరోనా వైరస్ పెనుముప్పు కాబోతుందని గ్రహించి అప్పటికప్పుడు లాక్ డౌన్ అంటూ ఎక్కడవారిని అక్కడే ఉండాలి, ప్రజలు ఇంటిలో నుండి బయటకు రాకూడదని ఏలిక వారు మనసులో మాట ప్రకటన చేశారు.


మరి మనిషి ఎలా బ్రతకాలి అంటే ఒక పెద్ద మనిషి “బ్రతికి ఉంటే బలుసాకు” అమ్ముకుని జీవించవచ్చు ఇంటిలో నుండి కదలకుండా వుండండి అని ప్రజలకు ఒక మంత్రం ఉపదేశించాడు. 


లాక్ డౌన్ నెలల నెలకు పెరిగిపోతుంది. పొట్ట చేతపట్టుకుని సొంత ఊరిని వదిలి పిల్ల జెల్ల తో పట్టణాలు, నగరాలు వలస వెళ్లిన వారి కడుపులో ఒక వైపు ఆకలి లావాలా మరిగిపోతుంటే అడుక్కోవడానికి కూడా దిక్కులేక నిర్జీవంగా ఉన్న మహా నగరాల ను వదిలి సొంత గ్రామాల వైపు అడుగులు వేయడం మొదలెట్టారు. 


ఒకటా రెండా వందల, వేల కిలో మీటర్లు. దారి తెలియదు, రైలు కట్ట వెంటపడి మూట, ముల్లె నెత్తిన పెట్టుకుని, పిల్లలను, పసికందులను మోసుకుంటూ బయలుదేరారు. 


వలస కూలీలు నడుస్తున్న ఈ యాత్ర భారతదేశ చరిత్రలో రెండో అంకం. మొదటిది భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోయినప్పటిది. 
పెద్దల మాట చద్దెన్నం మూట ( కూలి పని చేయించుకుని రాత్రి మిగిలిన చద్దెన్నం  అన్నం పెట్టి పంపేవారు అప్పట్లో మన పెద్ద మనుషులు)  అని మనకో సామెత ఉంది. నిజంగానే మన పెద్దలు చెప్పిన మాట చద్దె పడి కుళ్లిపోయి, పాచి పట్టి పోయి తినడానికి పనికిరాకుండా పోయింది.


భారతదేశం స్వాతంత్య్రం సాధించి ఏడు దశాబ్దాలు అయింది. 1947 ఆగస్టు 14 న బ్రిటీష్ వారు మన దేశాన్ని వదిలి వెళ్ళబోతున్నప్పుడు జవహర్ లాల్ నెహ్రు అన్న మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. 


పేదరికాన్నీ, అజ్ఞానాన్నీ, అసమానతల్నీ అంతమొందించవలిసిన గురుతర బాధ్యత మన ముందున్నది. 
ఈడెబ్భై ముడేళ్ళల్లో కనీసం కార్మికులుగా కూడా గుర్తింపుకు నోచుకోని శ్రామిక వర్గాలను వలస కూలీలు అంటూ, అసంఘటిత రంగం అంటూ ఏ హక్కు లేకుండా దేశాన్ని నిర్మించడంలో తమ శ్రామిక శక్తిని దారపోస్తున్న వారిపట్ల సవతి తల్లి ప్రేమ ను చూపిస్తున్న నేటి పాలక కులాలు. 


భారతదేశం వెలిగిపోతుందంటూ ఒకవైపు, స్లమ్ డాగ్ మిలియనీయర్ అంటూ ప్రపంచ బ్యాంకు, IMF లాంటి ఒప్పందాలతో సామ్బ్రజ్యా వాద పెట్టుబడిదారులకు గేట్లు బార్ల తెరిచి బోనులో ఉన్న పులితో  ( 1991 లో ది ఏకనమిస్ట్ పత్రిక భారత ఆర్ధిక వ్యవస్థను బోను లో ఉన్న పులి తో పోల్చింది) ఉదహరించారు. 


“ఓర్పుగా వుండే మనిషి ఆగ్రహించవచ్చు, జాగ్రత్త” అని మూడు వందల ఏళ్ళ క్రితం ప్రముఖ ఆంగ్ల కవి జాన్ డ్రేడన్ (1631-1770) చెచ్చరించాడు. 


జాన్ డ్రేడన్ పెట్టుబడిదారుడు తడిబట్టతో గొంతు నులిమి ప్రాణం తీస్తాడని ఊహించలేదా! భారతదేశం లాంటి కుల ప్రజాస్వామ్యం లో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, ఎన్నికలు, కోర్టులు, ప్రసార సాధనాలు, ప్రజలలో పెరుగుతున్న అశాంతిని, పెంపుడు జంతువులు గా ఎలా  మచ్చిక చెసుకుంటాయో ఊహించి ఉండకపోవచ్చు?


వలస కూలీలు రహదారులువెంట, రైలు పట్టాల మీద ఎర్రని ఎండలో నడుస్తూ తమ రక్తంతో సామాజిక అసమానతల చరిత్రను రాసుకుంటూ వెళ్తున్నారు. 


తమతో వచ్చేవారు, సోదరులు, అక్కలు, అమ్మలు, చెల్లెల్లు, తమ్ముళ్లు, తల్లి తండ్రులు మార్గ మధ్యలో చనిపోయినా మౌనంగా నడుస్తూనే ఉన్నారు. 
అల్టా మౌంట్ రోడ్డు లో ని  “అంటిల్లా” దీపపు కాంతులు చూసి దూరాన ఉన్న యాత్రికుడు భారతదేశం వెలుగుతుందని భ్రమించి ఉండవచ్చు. వలస కూలీలు అనే రెక్కలు తెగిన వలస పక్షులు అంటిల్లా తమ రాత్రులను కొల్లగొట్టాయని నిరసించలేని జీవస్థితిలో ఉన్నాయని తెలియదు. 

ప్రజల ఆర్ధిక, సామాజిక జీవితాల్లో విప్లవాత్మక మార్పులను ఏ రక్తపాతమూ లేకుండా తెచ్చే ప్రభుత్వ రూపమే ప్రజాస్వామ్యం అంటాడు డా.బాబాసాహెబ్ అంబేడ్కర్.


ఇప్పుడు  తూర్పు పడమర, దక్షిణ ఉత్తర రహదారులు అన్నీ వలస కూలీలు అనే శ్రామికుల రక్తం తో తడిచి ముద్దావుతున్నాయి. 


కారల్ మార్క్స్ సాంబ్రాజ్య వాద పెట్టుబడి ని పరాన్న భక్కు తో పోల్చాడు. పెట్టుబడి తాను గా వృద్ధి కలిగేది కాదుగనుక, శ్రమశక్తి, వనర్లు అనే రెండు కాళ్ళు లేకుండా అది నడవలేదు గనుక,  అసలు నిలబడలేదు గనుక అది యెంత మహారాక్షసి అయినా దాని కాళ్ళు రక్త మాంసాలు, ప్రాణం లేని  మట్టివని దాని పునాదులు కూల్చడం సులభమని అభిప్రాయ పడ్డాడు.


కరోనా మహమ్మారి వలన వలస కూలీలు / శ్రామిక వర్గాలు రియల్ ఎస్టేట్, హాస్పటాలిటి, గ్రానైట్, వస్త్ర పరిశ్రమ, తోళ్ళు ,రసాయన పరిశ్రమ, భవన నిర్మాణ రాగాల్లో కోట్లాది మంది వున్నారు. వీళ్ళంతా తిరిగి తమ సొంత స్థలాలకు వెళ్లడం భారత ఆర్ధిక రంగానికి పెను ప్రమాదం. కారల్ మార్క్స్ అన్నట్లు పెట్టుబడిదారుడి పునాదులు కూలే ప్రమాదం లేకపోలేదు!


భారత సమాజం రాజకీయ కుల, మత వ్యవస్థలో ఎంతగా కురుకుపోయిందంటే కేవలం తమ ప్రాంతం, కులం, మతం వాళ్లు  కాదుగనుక, తమ వర్గం కాదుగనుక సాటి భారతీయులు రైలు పట్టాల మీద పడుకుని ప్రమాదంకు గురై చనిపోతే చీమ చిట్టుకు మనే శబ్దం కూడా రాకూండా మౌనంగా ఉన్నారు. 


1991 లో పెట్టుబడి దారులకు గేట్లు బార్లా తెరిచే సమయంలో భారతీయ ఉదారవాద ఉద్యమాలు స్వచ్ఛంద సంస్థలు గా రూపాంతరం చెందాయి. ఇప్పుడు ఆ స్వచ్ఛంద సంస్థలే ప్రభుత్వాలకు నొప్పి తగలకుండా అక్కడ అక్కడ నడిచి వెళ్లేవారికి సహాయం చేస్తున్నాయి. 


పెట్టుబడిదారుడు ఆర్ధిక సహకారంతో (వివిధ ఫౌండేషన్లలో రీసెర్చ్ చేసే సామజిక శాస్త్రవేత్తలు) చదువుకున్న సామజిక శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు మీడియా వలస కూలీలు నడుస్తున్న తీరుకు  మానసిక చికిత్స అవసరం అంటున్నారు.  ఇంతకన్నా దుర్మార్గం మరేముంటుంది?


చివరిగా  మూడొందల యేండ్ల క్రితం జాన్ డ్రేడన్ చెప్పిన మాట మరోసారి గుర్తు చేసుకుందాం “ఓర్పుగా ఉండే మనిషి ఆగ్రహించవచ్చు, జాగ్రత్తా!”


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here